Bandi Sanjay : కవిత ఇల్లు చూసి సీబీఐ అధికారులు షాక్ అయ్యారు
Bandi Sanjay On KCR : తనను చంపినా సరే.. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని బండి సంజయ్ అన్నారు. పేదల గురించి ప్రశ్నిస్తే తల 6 ముక్కలు నరుకుతాడట అని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత ఆస్తిపరులున్న నేతల్లో కేసీఆర్ కుటుంబం నెంబర్ వన్ అని ఆరోపించారు.
'పేదల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నన్ను కేసీఆర్(KCR) 6 ముక్కలు చేస్తడట. నన్ను చంపినా సరే.. నేను చావడానికి రెడీ.. కానీ డబుల్ బెడ్రూం ఇళ్లు, రుణమాఫీ, నిరుద్యోగభృతి, దళిత, గిరిజన బంధు సహా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్.' అని బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. రూ.లక్ష కోట్ల దొంగ సారా, క్యాసినో దందాతో సంపాదించిన సొమ్ముతో కేసీఆర్ కుమార్తె ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుందని సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కాంపై విచారణ చేసేందుకు వెళ్లిన సీబీఐ(CBI) అధికారులు ఆ ఇంటిని చూసి విస్తుపోతున్నారని చెప్పారు. దేశంలో అత్యంత ఆస్తులున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్(KCR) నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangrama Yatra)లో భాగంగా 13వ రోజు కోరుట్ల నియోజకవర్గంలోని మోహన్ రావు పేటలో గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించారు బండి సంజయ్. ఈ సందర్భంగా తమ ఇబ్బందులు, సమస్యలను గ్రామస్థులు ఏకరవు పెట్టారు. సంవత్సరం నుంచి మీ కోసమే పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసం రాలేదన్నారు. కేసీఆర్(KCR) కనీసం బీడీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించలేదని ఆరోపించారు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి మరీ, గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ పాలనలో.. గల్ఫ్ బాధితుల సమస్యలు తీరలేదని.., గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళ శవాన్ని 6 నెలలైనా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. తెలంగాణ(Telangana) ఉద్యమంలో దుబాయ్ వెళ్లిన వాళ్లు కూడా కేసీఆర్ కు పైసలు ఇచ్చారని చెప్పారు. అలాంటి వాళ్ళను కూడా కేసీఆర్ తిట్టారని ఆరోపించారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి కొందరు దుబాయ్ లో సంవత్సరాలు తరబడి జైళ్ల లోనే మగ్గుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో.. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి పాలసీ కూడా తీసుకురాలేదని చెప్పారు.
'తెలంగాణలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే.. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తాం. కార్మికులను ఆదుకుంటాను. గల్ఫ్ దేశాల్లో జైళ్లలో మగ్గుతున్న బాధితులను కూడా తీసుకొస్తాం. తెలంగాణకు మోడీ 2,40,000 ఇళ్లను మంజూరు చేస్తే.. ఇక్కడ కేసీఆర్ కట్టించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కేసీఆర్ బిడ్డ కవిత దొంగసారా దందా చేసింది. లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. దేశంలోనే కేసీఆర్ పెద్ద ఆస్తిపరుడుగా మారాడు. కవిత పత్తాల దందా కూడా చేసింది. కవితపై విచారణ జరపాలా..? వద్దా..? కవిత ఇళ్లు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంద్రభవనంలా ఇళ్లు కట్టుకుంది.' అని సంజయ్ ఆరోపించారు.
కేంద్రం ఇస్తున్న నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. పేదోళ్ల ప్రభుత్వం వస్తేనే.. పేదోళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అందుకే బీజేపీ ప్రభుత్వం రావాలని కోరారు. కేసీఆర్ ఎన్ని పైసలు పంచినా... దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో, ప్రజలు కేసీఆర్ కు చెంప చెల్లుమనిపించే ఫలితాలనే ఇచ్చారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువు నీడలేని పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు.