Bandi Sanjay: కాంగ్రెస్ కేరాఫ్ కమీషన్ల సర్కార్...14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తారన్న బండి సంజయ్-bandi sanjay allegations pending bills will be sanctioned only if 14 percent commission paid ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: కాంగ్రెస్ కేరాఫ్ కమీషన్ల సర్కార్...14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తారన్న బండి సంజయ్

Bandi Sanjay: కాంగ్రెస్ కేరాఫ్ కమీషన్ల సర్కార్...14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తారన్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Dec 31, 2024 09:27 AM IST

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్ లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపణలు
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపణలు

Bandi Sanjay: తెలంగాణలో కమీషన్లపై కాంగ్రెస్‌లోనే అంతర్యుద్ధం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమీషన్ల భాగోతం బద్దలు కావొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో తాజా మాజీ సర్పంచుల జేఏసి అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నాయకులు జోగు లక్ష్మీరాజం, కనివేని శ్రీనివాస్, తాడెపు ఎల్లం, ఏలేటి నర్సింహారెడ్డి తదితరులు బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు.

yearly horoscope entry point

మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు.‌ కమీషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మంజూరు కాక రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు మాజీ సర్పంచులు రోడ్డున పడ్డా రేవంత్ రెడ్డి సర్కార్ కు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. మాజీ సర్పంచులకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందన్నారు. మాజీ సర్పంచుల పక్షాన అతి త్వరలోనే ఉద్యమిస్తామన్నారు.

సర్పంచ్ లకు రూ.1300 కోట్లు బకాయి...

రాష్ట్రవ్యాప్తంగా 12వేల 769 మంది తాజా మాజీ సర్పంచులున్నారని, వీళ్లందరికీ దాదాపు 13 వందల కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకుగాను ఒక్కో సర్పంచుకు 3 లక్షల నుండి కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అభివృద్ధి కార్యక్రమాలు కళ్ల ముందే కన్పిస్తున్నాయని ఇవన్నీ జరిగాయంటే అది తాజా మాజీ సర్పంచులవల్లేనని ప్రజలకు తెలుసు...కానీ ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఇకనైనా మాజీ సర్పంచ్ లు కళ్లు తెరవండి.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు, జెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేయండని కోరారు. మీరు చేసే ఉద్యమానికి బీజేపీ పూర్తి అండగా ఉంటుంది...కిషన్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడాను. మద్దతు ప్రకటించాలని చెప్పారు...ఈ విషయంలో బీజేపీ ముందుండి మీ తరపున పోరాడతామని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచుతామని తెలిపారు.

ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ బిల్లులు ఇలా అన్ని పెండింగ్ పెడుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం దిగిరావాలి... లేనిపక్షంలో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేందుకు సర్పంచులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది...

తెలంగాణలో 22శాతం క్రైం రేటు పెరిగిందని మహిళలపై అత్యాచారాలు 28 శాతం పెరిగింది. శాంతి భద్రతలను కాపాడాలేని చేతగాని సర్కార్ నడుస్తోంది. వీళ్లకు ప్రజల బాధలు పట్టవు. ఢిల్లీకి పోయి కప్పం కట్టి పదవులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవాలని లేదు... 6 గ్యారంటీలను అమలు చేయాలనే ధ్యాస లేదని బండి సంజయ్ విమర్శించారు.

రేవంత్ లో పవన్ కు ఏమి కనిపించిందో...

పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు. నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే... ఆయనలో మరి ఏం కన్పించిందో.. 6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయలేదు? క్రైం రేటు పెరిగింది. మరి ఆయనలో గొప్ప నాయకుడు ఎట్లా కన్పించారో వారికే తెలియాలి.

అల్లు అర్జున్ కు రేవంత్ రెడ్డి మధ్య చెడింది..

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు పోయి బెయిల్ పై వచ్చాడు. ఆ అంశం ముగిసింది. కానీ మళ్లీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు ఈ అంశంపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముంది? 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగమే. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ కు మధ్య ఏదో చెడింది. పుష్ప 2 సినిమాకు 1700 కోట్ల రూపాయల వచ్చినయ్. పుష్ప 3 సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు.. కానీ పుష్ప 3 సినిమా చూపించారు. నేనడుగుతున్నా... అల్లు అర్జున్ పై కేసును మృతురాలి భర్త వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు కదా... ఇంకా దీనిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు బండి సంజయ్.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner