Ganesh Immersion 2024 : గణేష్ శోభాయాత్రలో డీజేలు, బాణసంచా వాడకంపై నిషేధం - సీపీ ఆదేశాలు
Ganesh Immersion in karimnagar:వినాయకుడి నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16న సోమవారం జరిగే గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. డీజేల వినియోగం, బాణాసంచాలు కాల్చడం నిషేధమని నగర సీపీ అభిషేక్ మోహంతి ప్రకటించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేశుడి నిమజ్జనానికి పోలీస్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశుడి నిమజ్జనం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ నిఘా వర్గాలు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు గుర్తించారు. కరీంనగర్ లో 2931, పెద్దపల్లి లో 2405, జగిత్యాలలో 2791, సిరిసిల్లలో 2198 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించి జలాశయాల్లో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ లో సెప్టెంబర్ 16న సోమవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్బంగా జరిగే శోభయాత్ర రూట్ లో నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. పోలీసుపరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. దీనిలో భాగంగా గణేష్ శోభాయాత్రలో డీజేల వినియోగంతోపాటు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు.
అదేవిధంగా నిమజ్జనం కొరకు నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు ఎటువంటి ఆయుధాల ప్రదర్శన, ఇతరులను గాయపరిచే వస్తువులు కలిగివుండరాదని, విద్వేషపూరిత నినాదాలు, ప్రసంగాలు చేయడం లేదా పాటల వినియోగం వంటి చర్యలకు పాల్పడరాదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ప్రజలంతా భక్తి శ్రద్దలతో, మతసామారస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు.
అటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సిపి శ్రీనివాస్ ఆద్వర్యంలో నిమజ్జనోత్సవానికి పటిష్టమైన చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లాలో ఎస్పీ అశోక్ కుమార్, సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు. జలాశయాల వద్ద రెవెన్యూ, మున్సిపల్, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.