Osmania University : ఉద్యమాలకు పుట్టినిల్లు.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం!-ban on dharna and agitations at osmania university ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Osmania University : ఉద్యమాలకు పుట్టినిల్లు.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం!

Osmania University : ఉద్యమాలకు పుట్టినిల్లు.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం!

Osmania University : ఉస్మానియా యూనివర్సిటీ.. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ. పోరాటాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి చోట ధర్నాలు, ఆందోళనలపై నిషేధం విధించారు. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా.. 1969 లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు దారితీసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో.. ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓయూ విద్యార్థుల కృషి ఎంతో గొప్పది.

వందేమాతరం ఉద్యమంలో..

ఉస్మానియా యూనివర్సిటీ వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఉద్యమంలో దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు ముఖ్యపాత్ర పోషించారు. ఇలా ఎన్నో పోరాటాలు జరిగాయి. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం కదంతొక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవలి కాలంలో కూడా విద్యార్థుల హక్కుల కోసం, విశ్వవిద్యాలయంలో మెరుగైన సౌకర్యాల కోసం నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నిషేధం..

ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం విధించారు. దానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. యూనివర్సిటీ విభాగాలు, పరిపాలనా భవనాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల చదువులకు, యూనివర్సిటీ పరిపాలనా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల విద్యా వాతావరణం దెబ్బతింటుందని, విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించలేకపోతున్నారని అధికారులు అంటున్నారు.

ముందస్తు జాగ్రత్తగా..

కొన్నిసార్లు ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉందని.. దీనివల్ల యూనివర్సిటీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు..

అయితే.. ఈ నిషేధంపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలకు కేంద్ర బిందువని, ఇక్కడ ఆందోళనలను నిషేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అంటున్నారు. అలాగే, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా.. వారి గొంతు నొక్కడం సరికాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. యూనివర్సిటీ విభాగాలు, పరిపాలనా భవనాల్లో మాత్రమే ధర్నాలు నిషేధించామని అధికారులు చెబుతున్నారు. విద్యా, పరిపాలనా విధులకు ఆటంకం కలగకుండా మాత్రమే సర్క్యులర్‌ ఇచ్చామని అంటున్నారు.

 

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం