Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?-bal reddy master teaches students without taking money in siddipet district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?

Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?

Siddipet : చాలామంది టీచర్లు స్కూలుకి టైమ్‌కి వెళ్లడం లేదు. వెళ్లినా పూర్తి సమయం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంకా కొందరైతే.. ప్రైవేట్ పాఠశాలలు స్థాపించి.. ఎక్కువ సమయం వాటికే కేటాయిస్తున్నారు. అలాంటి వారున్న ఈ కాలంలో.. ఓ మాస్టారు మాత్రం రిటైర్ అయ్యాక కూడా పాఠాలు బోధిస్తున్నారు. అది కూడా ఉచితంగా.

బాల్ రెడ్డి మాస్టారు

సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ మాస్టారు పేరు బాల్ రెడ్డి. వయస్సు దాదాపు 80 ఏళ్లు ఉంటాయి. 1970లో బాల్ రెడ్డి ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2005 వరకు పనిచేసి రిటైర్ అయ్యారు. 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పేద విద్యార్థులకు పాఠాలు చెప్పిన బాల్ రెడ్డి.. రిటైర్ అయ్యాక కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు.

రిటైర్ అయ్యాక కూడా..

రిటైర్ అయ్యాక కూడా ఇంకా విద్యార్థులకు పాఠాలు చెప్తూనే ఉన్నారు. 2005 నుంచి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం, దాచారం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పైసా ఆశించకుండా పాఠాలు చెప్పారు. పైగా తన స్వగ్రామం తిగుల్ నుంచి ప్రతిరోజూ 15 కిలోమీటర్లు తన సొంత డబ్బులతో ఆటోలో ఆయా గ్రామాలకు వెళ్లి పిల్లలకు చదువు చెప్పారు.

పదేళ్లుగా..

ఇలా గడిచిన 10 ఏళ్ల నుంచి తన స్వగ్రామంలోనే విద్యార్థులకు ఒక్కరే తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తున్నారు. అనారోగ్యం, అలసట అనేది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల మద్యే ఉంటూ.. వారితో దగ్గరుండి చదివిస్తున్నారు. 80 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాక కూడా ఎందుకింత రిస్క్ అని కొందరు ప్రశ్నించగా.. బాల్ రెడ్డి మాస్టారు మంచి సమాధానం చెప్పారు.

అదే నా ప్రయత్నం..

'ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలంతా పేద వాళ్లే. వాళ్ల తల్లిదండులకు విధిగా ట్యూషన్లు చెప్పించే స్థోమత ఉండదు. తల్లిదండ్రుల రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు పోవాలంటే పిల్లలు ఉన్నత చదువులు చదవాలి. అందుకోసమే నా ఈ ప్రయత్నం' అని బాల్ రెడ్డి మాస్టారు చెప్పుకొచ్చారు. నామమాత్రంగా పాఠాలు చెప్పి.. లక్షలు సంపాదించుకుంటున్న టీచర్లు, విద్యను వ్యాపారం చేసి అమ్ముకుంటున్న విద్యాసంస్థలు ఉన్న నేటి సమాజంలో.. బాల్ రెడ్డి మాస్టారు లాంటి గొప్ప మనుషులు ఇంకా ఉన్నారా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.