MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్-bail granted to two accused in trs mlas poaching case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bail Granted To Two Accused In Trs Mlas Poaching Case

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 09:57 PM IST

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. చంచల్ గూడ జైలు నుంచి.. వారు విడుదల కానున్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు బెయిల్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు బెయిల్ (HT)

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫాం హౌస్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేలకు ఎరకేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ఏసీబీ(ACB) ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఏ1 రామచంద్ర భారతి, ఏ2 నందకుమార్ రూ.6 లక్షల చొప్పున నాంపల్లి కోర్టు(Nampally Court)లో పూచీకత్తు సమర్పించారు. చంచల్ గూడ జైలు నుంచి గురువారం నిందితులు విడుదల కానున్నారు. ఇదే కేసులో సింహయాజీకి సైతం బెయిల్(Bail) మంజూరైంది. చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు. సింహయాజీ న్యాయవాది రూ.6లక్షల పూచీకత్తుతోపాటు ఇద్దరు జామీను సమర్పించారు.

ట్రెండింగ్ వార్తలు

సింహయాజీకి హైకోర్టు(High Court) గతంలో బెయిల్ మంజూరు చేసింది. అయితే పూచీకత్తు, జామీను సమర్పించడంలో ఆలస్యమైనందున విడుదల కాలేదు. ఆరు రోజుల తర్వాత ఇద్దరు జామీను, రూ.6లక్షల పూచీకత్తులో సింహయాజీ విడుదల అయ్యారు.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్(BL Santhosh), తుషార్, జగ్గు స్వామిని నిందితులుగా చేరుస్తూ.. దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. దీంతో సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును ఏసీబీ మాత్రమే.. దర్యాప్తు చేయాలని, పోలీసు, సిట్ కు అధికారం లేదన్న.. కోర్టు నిర్ణయంపై రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్(SIT)కు లేదని ఏసీబీ స్పెషల్ కోర్టు తేల్చి చెప్పింది. గత నెల 22న సిట్‌‌ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్‌‌ చేసింది. విచారణ చేపట్టిన కోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో సిట్ అధికారులు వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు.

సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) ఈ కేసును ట్రాప్ చేశారు. నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఏసీబీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని.. సీనియర్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో సీట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని సిట్ పిలుస్తోంది.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్-బీజేపీ(TRS Vs BJP) మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇప్పటికే పలు కీలక విషయాలను అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఓవైపు సీఎం కేసీఆర్ కూడా వీలుదొరికినప్పుడల్లా.. ఎమ్మెల్యేల ఎర కేసు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చిన దొంగలను పట్టుకుని జైల్లో వేశామని విమర్శలు గుప్పిస్తున్నారు.

IPL_Entry_Point