కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం పూర్తి - ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేలే..! రాజకీయ ప్రస్థానం వివరాలివే-background of the three new ministers in the telangana cabinet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం పూర్తి - ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేలే..! రాజకీయ ప్రస్థానం వివరాలివే

కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం పూర్తి - ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేలే..! రాజకీయ ప్రస్థానం వివరాలివే

తెలంగాణ కేబినెట్ విస్తరణలో ముగ్గురికి చోటు దక్కింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి. వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తో మధ్యాహ్నం 12 తర్వాత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ముగ్గురు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినవాళ్లు కావటం విశేషం.

తెలంగాణ కేబినెట్ లోకి ముగ్గురు కొత్త మంత్రులు

తెలంగాణ కేబినెట్ విస్తరణ ప్రక్రియలో అడుగు ముందుకు పడింది. ఆరు ఖాళీలకు గాను మూడు బెర్తులను భర్తీ చేశారు. కొత్తగా వి.శ్రీహరి ముదిరాజ్, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు అవకాశం కల్పించింది. వీరితో ఇవాళ రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ జిష్ణదేవ్ శర్మ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన ఈ ముగ్గురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే కావటం విశేషం. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచారు.

కొత్తగా మంత్రులుగా నియమితులైన వారికి గవర్నర్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం:

  • అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
  • అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1982 నుండి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల NSUI అధ్యక్షుడిగా పని చేశారు.
  • 1986 నుండి 94 వరకు ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు.
  • 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.
  • అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుండి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు.
  • 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు,
  • 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
  • 2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు.
  • అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ తరువాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
  • 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
  • అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను 2023 డిసెంబర్ 15న ప్ర‌భుత్వ విప్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. తాజాగా ఆయనకు కేబినెట్ లో బెర్త్ కల్పించింది.

వివేక్ ప్రస్థానం:

  • వివేక్ పూర్తి పేరు… గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇయన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి కుమారుడు.
  • బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను చదివారు. ఉస్మానియా వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు.
  • 2009లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
  • తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ లో పోరాడారు.
  • ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడిని వివేక్… 2013లో టీఆర్ఎస్ లో చేరారు. కొద్దిరోజులకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
  • 2016లో మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్… రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.
  • 2019లో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన వివేక్… బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితుల్యారు.
  • బీజేపీని వీడిని వివేక్… మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
  • వివేక్ కుమారుడైన గడ్డం వంశీ… ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ( కాంగ్రెస్)గా ఉన్నారు.

వాకిటి శ్రీహరి నేపథ్యం:

  • వాకిటి శ్రీహరి ముదిరాజ్ ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
  • తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
  • 2001 నుండి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్‌గా పని చేశారు.
  • 2014 నుండి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీగా ఉన్నారు.
  • 2014 నుండి 2018 వరకు కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యారు.
  • 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మక్తల్ నుంచి గెలిచారు.
  • 17525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • బీసీల కోటాలో కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.