Eye donation : వారి కళ్లు ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి.. నేత్రదానంతో అంధులకు చూపునిద్దాం..
Eye donation : సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. అన్నారు పెద్దలు. అందమైన ప్రపంచాన్ని చూడాలంటే.. చూపు సక్రమంగా ఉండాలి. అంతటి ప్రాముఖ్యత ఉన్న నేత్రాలను సంరక్షించుకోవటం.. అంధత్వాన్ని నియంత్రించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ.. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు.
మరణాంతరం ఈ సృష్టిని చూసే అవకాశం ఉండాలంటే.. నేత్ర దానమే ఏకైక మార్గం. రోడ్డు ప్రమాదాల్లో, తీవ్ర అనారోగ్యాలతో రోజూ ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోయిన ఒక వ్యక్తి నేత్రదానంతో అంధులైన ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. నేత్రదానం ద్వారా వ్యక్తి మరణించిన అతని కళ్లు జీవించే ఉంటాయి. చనిపోయిన వ్యక్తి వేరొకరి ద్వారా ప్రపంచాన్ని చూస్తూనే ఉంటారు. అంధులకు కార్నియా ఆపరేషన్లు చేయడం ద్వారా కంటి చూపును ప్రసాదించవచ్చు.
వృథా కాకుండా..
మరణించిన తర్వాత నేత్రాలు వృథాగా భూమిలో కలిసిపోకుండా.. మంటల్లో కాలి బూడిద కాకుండా.. ప్రజలకు 'నేత్రదానం'పై అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ తదితర స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు విస్తృతంగాన అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో వందలాది మంది.. మరణాంతరం నేత్రదానం చేసి ఎంతోమందికి చూపును ప్రసాదించారు. వేలాది మంది తమ మరణాంతరం నేత్రదానం చేస్తామని అంగీకారాన్ని ప్రకటించి, డోనర్ కార్డులు పొందారు.
అపోహాలు వద్దు..
మరణానంతరం నేత్రాలు, అవయవాలు, శరీరం మట్టిలో కలసిపోకుండా.. దానం చేసి మానవ మనుగడకు తోడ్పడాలని.. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ సూచించారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని.. కరీంనగర్ లో జరిగిన నేత్ర అవయవ, శరీర దానాలపై అవగాహన సదస్సులో నిర్వహించారు. నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
కేవలం కార్నియా మాత్రమే..
నేత్రదానం అంటే.. మొత్తం కను తీయబోరని.. కేవలం "కార్నియా " పొరను మాత్రమే తీస్తారని శ్రవణ్ వివరించారు. మరణించిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా.. ఇంటి వద్దనే తీసుకుంటారని చెప్పారు. ఈ కార్నియా మార్పిడి కోసం 15 లక్షలకు పైగా అంధులు వేచి ఉన్నారని.. వారిలో 60 శాతం మంది 12 సంవత్సరాల లోపు చిన్నారులు ఉన్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో నేత్రదానం ఒక యజ్ఞంలా కొనసాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలోనూ అమలు చేయాలి..
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో.. నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను కళాశాల అధ్యాపక బృందంతో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. మరణాంతరం నేత్రాలు, అవయవాలు వృథా కాకుండా.. ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్పెయిన్, శ్రీలంక తరహాలో.. మనదగ్గర కూడా చట్టసభల్లో శాననం చేయాలన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అవయవదాతకు దహన సంస్కారాలు నిర్వహించడం, కుటుంబానికి ప్రశంసాపత్రం, రూ.10 వేలు ఆర్థికసాయం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకుందని వివరించారు. అవయవదానంలో ప్రథమస్థానంలో ఉన్న తెలంగాణలోనూ అమలు చేయాలని కోరారు. సదాశయ ఫౌండేషన్ ద్వారా 1188 నేత్రదానాలు, 88 మంది అవయవదానాలు, 125 మంది శరీరదానాలు జరిగాయని వెల్లడించారు.
(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)