Karimnagar Farmer: ఆదర్శ రైతుకు అరుదైన పురస్కారం, మల్లిఖార్జున్ రెడ్డికి ఈనెల 22న ప్రదానం...
Karimnagar Farmer: ఉద్యోగం వదిలి సాగుబడిచేపట్టి ఆదర్శ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు కరీంనగర్ జిల్లా పెద్దకుర్మపల్లికి చెందిన మావురం మల్లిఖార్జున్ రెడ్డి. మందులు వాడకుండా సమీకృత సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఆయన తాజాగా ఫెల్లో ఫార్మర్ పురస్కారానికి ఎంపికయ్యారు.

Karimnagar Farmer: ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐకార్) ద్వారా దేశ వ్యాప్తంగా ఆరుగురు జాతీయ ఉత్తమ రైతులను ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన మావురం మల్లికార్జున్ రెడ్డి ఎంపికయ్యారు.
పూస కృషి విజ్ఞాన్ మేళా ద్వారా ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే సదస్సులో ఈ మేరకు ఐకార్ అధికారులు 2025కు సంబందించిన ఫెలో ఫార్మర్ జాతీయ అవార్డును అందించనున్నారు. ఐకార్ సంస్థ 2021లో అందించిన ఇన్నోవేటీవ్ ఫార్మర్ అవార్డును మల్లికార్జున్ రెడ్డి అందుకున్నారు.
వ్యవసాయంలో కొత్త విధానాలను కనుగొన్నందుకు ఇన్నోవేటివ్ అవార్డును ఏటా 30 మంది వరకు అందిస్తుండగా నాలుగేళ్ల క్రితం ఈ అవార్డును మల్లిఖార్జున్ రెడ్డి అందుకున్నారు. తాజాగా వ్యవసాయంలో తోటి రైతులకు మార్గదర్శకంగా నిలిస్తే అందించే ఫెల్లో ఫార్మర్ అవార్డుకు తాజాగా ఎంపికయ్యారు. 22 నుంచి జరిగే పూస కృషి విజ్ఞాన్ మేళాలో అవార్డు అందుకోనున్నారు.
ఉద్యోగం వదిలి పుడమి తల్లిని నమ్ముకుని...
పెద్దకుర్మపల్లికి చెందిన రైతు మావురం లక్ష్మారెడ్డి కుమారుడు మల్లికార్జున్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించారు. సాప్ట్ వేర్ ఉద్యోగం చేశారు. ఏటా లక్షల్లో వచ్చే జీతం వదులుకుని కరోనా సమయంలో ఇంటికి చేరిన మల్లిఖార్జున్ రెడ్డి గ్రామంలో తన తండ్రి ద్వారా వచ్చిన భూమిలో రసాయనాలు లేని వ్యవసాయం ప్రారంభించాడు.
సతీమణి సంధ్య కూడా ఎంబీఏ చేసి ఉద్యోగం చేయగా ప్రస్తుతం ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలతో స్వగ్రామంలో ఉంటూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ వ్యవసాయం సాగిస్తున్నారు. సుమారు దశాబ్ద కాలంగా ఆయన మందుల పిచికారీ లేని సేద్యంతో పాటు, సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించి విజయం సాధించాడు.
ప్రస్తుతం పదెకరాల్లో వరి, ఐదెకరాల్లో పామాయిల్, అరటి, కోకోను మిశ్రమ పంటగా సాగు చేస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో ఆవులు, కోళ్లు, మేకలు, చేపల పెంపకం నిర్వహించారు. గతంలో పసకొమ్ము వంటి నూతన పంటలను సాగు చేసి ఇన్నోవేషన్ ఫార్మర్ అవార్డు సాధించగా, పదేళ్లుగా రసాయనాలు లేని పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలువడంతో ఫెలో పార్మర్ అవార్డును సొంతం చేసుకున్నారు. వంటిమామిడి వద్ద వంద ఎకరాల భూమిని లీజుకు తీసుకుని సమీకృత వ్యవసాయం చేసేందుకు ఓ సంస్థతో ఒప్పందం చేసుకొని పంటలను కల్టివేషన్ చేస్తున్నారు.
జాతీయ భావం...
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఏడాది పాటు ఆయన తన వ్యవసాయ క్షేత్రం వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటుకున్నారు. ప్రతినెలా వ్యవసాయ అధికారులు ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రదర్శనలు నిర్వహించి ఇతర రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గతేడాది దేశవ్యాప్తంగా ఆరుగురు అభ్యుదయ రైతులతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో మాట్లాడగా, తెలంగాణ నుంచి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడారు. తనకు అవార్డు రావడం పట్ల గర్వంగా ఉందని, ఇది వ్యవసాయంలో మరిన్ని నూతన విధానాలకు నాంది పలుకనుందని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. తనకు సహకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)