Hydra : వారిపై చర్యలు తప్పవు.. వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్!-av ranganath key comments on the demolition of illegal structures in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : వారిపై చర్యలు తప్పవు.. వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్!

Hydra : వారిపై చర్యలు తప్పవు.. వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్!

Basani Shiva Kumar HT Telugu
Dec 28, 2024 05:44 PM IST

Hydra : హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని స్పష్టం చేశారు. హైడ్రా వల్ల ప్రజలకు అవగాహన కలిగిందని వ్యాఖ్యానించారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ఐదు నెలల అనుభవాలతో.. వచ్చే ఏడాదికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారులు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని వెల్లడించారు. 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించిందని వివరించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.

yearly horoscope entry point

'1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత. శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్‌తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్‌టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం. ఎఫ్‌టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుంది' అని రంగనాథ్ వివరించారు.

5800 ఫిర్యాదులు..

'శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్‌టీఎల్ నిర్దారణ జరుగుతుంది. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం. 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం' అని హైడ్రా కమిషనర్ వ్యాఖ్యానించారు.

డంపింగ్‌పై దృష్టి..

'భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తాం. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి. నాగోల్‌లో ఉన్న డీఆర్ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుంది. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం' అని రంగనాథ్ వివరించారు.

హైడ్రాకు ఎఫ్ఎం ఛానల్..

'హైడ్రా కోసం త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్‌కు ప్రయత్నిస్తున్నాం. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుంది. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుంది. జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న షెడ్లను ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు. ప్రజల ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం' అని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

Whats_app_banner