MMTS Rape Attempt: హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్ రైల్లో అనంతపురానికి చెందిన యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటనతో తప్పించుకునే ప్రయత్నంలో యువతి రైలు నుంచి కిందకు దూకేయడంతో తీవ్రంగా గాయపడింది. గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి జరిగింది. యువకుడి నుంచి తప్పిం చుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సెల్‌ఫోన్ పాడవడంతో శనివారం ఎంఎంటిఎస్ రైల్లో సికింద్రాబాద్ వచ్చింది. ఫోన్ మరమ్మతు చేయించుకున్న తర్వాత మేడ్చల్ వెళ్లేందుకు ఎంఎంటీఎస్ రైల్లో బయలుదేరింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటిఎస్ మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న ఇద్దరు మహిళలు అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండటంతో ఓ యువకుడు (25) ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకోడానికి కదులుతున్న రైలు నుంచి బయటకు దూకింది. గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆమె ట్రాక్ పై పడింది.
కొంపల్లికి సమీప ప్రాంతంలో పట్టాలపై యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 108లో యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి కోలుకున్న తర్వాత ఆమె నుంచి సమాచారం సేకరించారు. 20ఏళ్ల లోపు వయసు ఉన్న యువకుడు దాడి చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం