Chevella Congress : చేవెళ్ల కాంగ్రెస్ లో గ్రూప్ వార్...! ఎమ్మెల్యే కాలె యాదయ్య కారుపై కోడిగుడ్లతో దాడి
సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన ఎదురైంది. బుధవారం షాబాద్ కు వెళ్లిన ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటన చేవెళ్ల కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు హస్తం శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమైంది. బుధవారం షాబాద్ లో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు, కార్యకర్తలు… ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. 'గో బ్యాక్ యాదయ్య..' అంటూ నినాదాలు చేశారు.ఈ క్రమంలోనే కొందరు ఆయన వాహనంపైకి కోడి గుడ్లను విసిరారు.
ఇంతలోనే యాదయ్య అనుచరులు రంగంలోకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు… పరిస్థితి చక్కదిద్దారు. అయితే యాదయ్య చేరిక తర్వాత చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన భీం భరత్ ఓ వర్గంగా ఉండగా… పార్టీలో చేరిన కాలె యాదయ్య మరో వర్గంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది.
ముఖ్యంగా పార్టీలో ప్రాధాన్యత, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలిసింది. ఇంత కాలం పార్టీ కోసం పోరాడిన తమకు కాదని… ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు యాదయ్య ప్రాధాన్యత ఇస్తున్నారని భీం భరత్ వర్గం ఆరోపిస్తోంది.
బీఆర్ఎస్ లో గెలిచి… హస్తం గూటికి చేరి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన… ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన యాదయ్య…. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 268 ఓట్ల తేడాతో బయటపడ్డారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీమ్ భరత్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఓ దశలో యాదయ్య ఓటమి ఖాయమనే వార్తలు రాగా… చివరల్లో 268 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ 64 సీట్ల గెలిచి అధికారంలోకి వచ్చింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరే బాటలో చేవెళ్ల నుంచి గెలిచిన యాదయ్య కూడా హస్తం కండువా కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావటంతో పార్టీ కార్యక్రమాలను ప్రస్తుతం యాదయ్యనే చూస్తున్నారు. ఈ క్రమంలోనే భీమ్ భరత్, యాదయ్య వర్గాల మధ్య గ్రూప్ వార్ నడుస్తోంది.