BRS MLA Harish Rao : సిద్దిపేట లో అర్ధరాత్రి హైటెన్షన్...! హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికార నివాసం(ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్) పై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడి చేశారు. తాళాలు పగలగొట్టి పలు వస్తువులను ధ్వంసం చేశారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ… కాంగ్రెస్ గుండాలు ఈ దాడి చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికార నివాసం(ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్) పై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి పలు వస్తువులను ధ్వంసం చేశారు.
క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దాడి చేసేందుకు వచ్చిన వారు… జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వారిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ కార్యకర్తలు రావడంతో హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపించేశారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ గుండాలు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అర్ధరాత్రి దాడి చేయడాన్ని చూస్తే తీవ్ర ఆందోళనలను రేకెతుస్తోందని ఓ వీడియోను పోస్టు చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇలా దాడి చేస్తే… సామాన్యలు భద్రతకు ప్రభుత్వం ఏం భరోసా ఉంటుందని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హరీశ్ రావు పేర్కొన్నారు.
"ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం.. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలి" అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ విషయంపై హరీశ్ రావు టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాటకు కట్టుబడి హరీశ్ రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలంతా ఛాలెంజ్ విసిరారు. లేకపోతే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరామని అంటున్నారు.
మరోవైపు హైదరాబాద్ లో హరీశ్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానంటూ గతంలో హరీష్ రావు వ్యాఖ్యలపై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మైనంపల్లి అభిమానుల పేరిట ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అంటూ ఇందులో రాశారు. సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
మరోవైపు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘రుణమాఫీ మాట తప్పి మోసం…రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం’ అంటూ ఇందులో 'రాశారు. చెప్పింది కొండంత, చేసింది రవ్వంతా' మరో చోట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రుణమాఫీపై మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయాలని… హోర్డింగ్స్ పై రాశారు. 31 వేల కోట్లు చెప్పి 17 వేల కోట్ల మాఫితో సరిపెట్టారని ఇందులో ప్రస్తావించారు.
మొత్తంగా చూస్తే… రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ కు దారి తీసింది. హామీ ఇచ్చింది ఒక్కటైతే… చేసింది మరోలా ఉందంటూ కారు పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రుణమాఫీ అనేది పచ్చి అబ్ధమంటూ మాట్లాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం… ఇచ్చిన హామీని అమలు చేశామని చెప్పుకొస్తున్నారు.
టాపిక్