SI Suicide Case : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి-aswaraopeta si sriramulu srinivas died in yashoda hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Si Suicide Case : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి

SI Suicide Case : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 08:03 AM IST

Aswaraopeta SI Suicide: యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. పైఅధికారుల వేధింపులు భరించలేక శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృత్యువుతో పోరాడి ఓడారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

సీఐ వేధింపుల కారణంగా ఆయన గత ఆదివారం రాత్రి మహబూబాబాద్ లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. సరిగ్గా వారం రోజుల పాటు చికిత్స పొందుతూ చివరికి మృత్యువాత పడ్డారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆత్మహత్యకు ప్రయత్నించిన కొద్ది క్షణాల తర్వాత ఆయనకు తన భార్యా పిల్లలు గుర్తుకు వచ్చి బతకాలన్న కోరికతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అయినా దురదృష్టవశాత్తు ఆయన చికిత్స పొందుతూనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

సీఐ జితేందర్ రెడ్డిపైనే గురి..

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల వేధింపులతో ఒక ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం అటు పోలీస్ వర్గాలతో పాటు ఇటు సాధారణ ప్రజానీకాన్ని సైతం ఆలోచనలో పడేసింది.

తన చావుకు కారణాలపై ఎస్సై తన ఫోన్ లోనే ఆధారాలను ఉంచారు. ఎస్సై శ్రీనివాస్ సెల్ఫోన్లో నమోదైన వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై ఆత్మహత్య యత్నానికి కారణం సీఐ జితేందర్ రెడ్డిగా తేల్చారు. దీంతో సీఐను ఐజి కార్యాలయానికి అటాచ్ చేయడంతో పాటు అతనిపై అట్రాసిటీ కేసు సైతం నమోదు చేశారు.

అలాగే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను సైతం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ వారిపై కూడా అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఒక ఎస్సై స్థాయి అధికారి బలవన్మరణానికి పాల్పడిన తీరుతో సీఐ జితేందర్ రెడ్డి వ్యవహార శైలితో పాటు విధి నిర్వహణలో ఆయన కార్యకలాపాలపై పోలీస్ శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ను ఆయన అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలడం సీఐ పని తీరును ప్రస్ఫుటం చేస్తోంది. తాజాగా సీఐ ఆగడాలకు ఒక ఎస్సై జీవితమే బలై పోవడం ఆ శాఖలో మరింత విషాదానికి కారణమైంది. కాగా ఎస్సై వాగ్మూలం ఆధారంగా వేగంగా విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు ఎస్సై మరణం తరవాత సీఐపై ఎలాంటి కఠిన చర్యలకు ఉపక్రమిస్తారో వేచి చూడాలి.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

WhatsApp channel

సంబంధిత కథనం