Ashada Bonalu 2023: జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు…గోల్కొండ అమ్మవారికి తొలి బోనం
Ashada Bonalu in Telangana:హైదరాబాద్‌లో ఆషాడ బోనాలపై మంత్రులు సమీక్షించారు. వచ్చే నెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
Ashada Bonalu 2023 in Hyderabad: త్వరలోనే భాగ్యనగరంలో బోనాల పండగ సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 22 నుండి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేట లోని హరిత ప్లాజా లో బోనాల ఏర్పాట్లపై ప్రారంభమైన ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, CS శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు హాజరయ్యారు.
జూన్ 22 న గోల్కొండ లో ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. 10వ తేదీన రంగం ఉంటుంది. 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలను సర్కార్ కేటాయించిందన్నారు తలసాని.
బోనాల నేపథ్యం…?
సంప్రదాయానికి చిహ్నం.. బోనం. స్త్రీమూర్తులే తయారు చేస్తారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ.. గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ.. వేడుకుంటారు. గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి.. ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. అయితే ఈ బోనాలు.. తెలంగాణతోపాటుగా.. ఏపీలోని రాయలసీమ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోనూ చేసుకుంటారు.
అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేదా రాగికుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఒక దీపం కనిపిస్తూ ఉంటుంది. వాటిని నెత్తిన పెట్టుకుని.. డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. బోనాల కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ అని కూడా పిలుస్తుంటారు. రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారం ఈ బోనాల పండుగలో కనిపిస్తుంది. జానపద కళలు, డప్పుల చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలతో పండగ వాతావరణం ఉంటుంది.
వందల ఏళ్ల నుంచి ఈ బోనాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా దీన్ని నిర్వహిస్తుంటారు. మనిషి కొండల్లో జీవించే సమయంలో ఒక రాయిని దేవతగా చేసుకుని పువ్వు, కొమ్మ, పసుపు కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను సమర్పించాడని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పుడు మెుదలైన.. ఈ ఆచారం.. కొనసాగుతూ వచ్చిందంటారు. పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ఉండేదని చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాలు ఏడు కోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి, బోనాలు సమర్పించారట. 1676లో కరీంనగర్ హుస్నాబాద్‌లో ఎల్లమ్మగుడిని సర్వాయి పాపన్న కట్టించాడు. అక్కడ కూడా దేవతకు బోనాలు సమర్పించినట్టు కైఫీయతుల్లో గౌడనాడులు గ్రంథంలో ఉంది.
భాగ్యనగరం విషయానికొస్తే.. 1869లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారి వ్యాపించింది. వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. దైవాగ్రహాంతో ఇలా జరుగుతుందని.. ప్రజలు భావించారు. గ్రామ దేవతలను శాంతపరచడానికి ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన పండగే బోనాలు అని చెబుతుంటారు. 1675లో గోల్కొండను పాలించిన లబుల్ హాసన్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్టు కూడా చరిత్ర చెబుతోంది. రుతుపవనాలు ప్రవేశించి.. వర్షా కాలం మెుదలుకాగాననే.. మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తాయి. వాటితోపాటుగా సీజనల్ అంటువ్యాధులు బాధిస్తాయి. ఈ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు కూడా సంబంధం ఉంది. వేప ఆకు క్రిమినాశినిగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేప ఆకులు కడతారు. బోనం ఎత్తుకున్న మహిళలు వేప ఆకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లుతారు. ఇలా బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.