Vemulawada Crime: గంజాయి దందాలో ఆధిపత్య పోరుతో హత్య... వేములవాడ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Vemulawada Crime: వేములవాడ లో రెండు రోజుల క్రితం యువకుడి దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడ్డ ముఠాకు చెందిన ఐదుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని ప్రకటించారు. గంజాయి దందే హత్యకు కారణమని స్పష్టం చేశారు.
Vemulawada Crime: ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 13న యువకుడు పర్శరాములు హత్య కేసులో నలుగురి అరెస్టు చేశారు. వారి నుంచి రెండు గొడ్డళ్ళు, కొబ్బరి బొండాలు నరికే కత్తి, రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సమక్షంలో మీడియా ముందు వాటిని ప్రదర్శించి వివరాలు వెల్లడించారు.
వేములవాడలో హత్యకు గురైన పరశురాం.. ప్రస్తుతం అరెస్టు అయిన కోనాయిపల్లికి చెందిన బైరెడ్డి వినయ్, వేములవాడ కు చెందిన ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదునూరి రాజేశ్ అంతా ఓకే గ్యాంగ్ అని, గంజాయి దందాలో నిందితులేని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా పర్శరాం ముఠాకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరిస్తున్నాడనే నెపంతో హత్య చేసినట్లు తెలిపారు.
ప్రాణం తీసిన గంజాయి...
వేములవాడలోని శ్రీనగర్ కాలనీ చెందిన మృతుడు చెట్టిపెల్లి పర్శరాములు నిందితులైన బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదునూరి రాజేష్, అడ్డగట్ల మనోజ్ కుమార్ ఆరుగురు గతంలో కలిసి తిరిగేవారు. వారందరి పైన గంజాయి కేసులు, హత్య కేసులు, పలు కేసులు వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యాయి. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
గత కొంతకాలంగా పర్శరాములు మిగతా ఐదుగురితో ఉండకుండా తన పని తాను చేసుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఐదుగురు నిందితుల పైన వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదు కాగా, గంజాయి కేసులు కావడానికి మృతుడు పర్శరాములే కారణమని అనుమానించారు.
తమ గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని అనుమానంతో పర్శరాములను చంపితే ఇక గంజాయి దందాకు అడ్డు ఉండదని, పోలీసులకు దొరకమని, తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయవచ్చునని అయిదుగురు నిందితులు భావించారు. అనుకున్నదే తడవుగా 13న సాయంత్రం గంజాయి మత్తులో పక్కా ప్లాన్ తో హత్య చేశారని ఏఎస్పీ తెలిపారు.
నలుగురు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా....
పర్శరాములును కత్తి గొడ్డళ్ళతో అత్యంత దారుణంగా నరికి చంపిన కేసులో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొనగా ఒకరు పరోక్షంగా సహకరించాలని పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన నలుగు ప్రత్యక్షంగా హత్యలో పాల్గోన్నారని ప్రస్తుతం పరారీలో ఉన్న అడ్డగట్ల మనోజ్ కుమార్ పరోక్షంగా సహకరించారని ఏఎస్పీ తెలిపారు.
హత్య జరిగిన అనంతరం జైలుకు వెళ్తే బెయిల్ పై తీసుకురావడానికి తాను బయట ఉంటానని మనోజ్ కుమార్ చెప్పి నలుగురిని హత్య చేయడానికి పంపించాడు. ప్రస్తుతం అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయి విక్రయించినా, వినియోగించిన కఠినంగా చర్యలు తప్పవని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి హెచ్చరించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం