BRS Khammam Public Meeting : నేడు ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ…-arrangements completed for brs first public meeting in khammam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Arrangements Completed For Brs First Public Meeting In Khammam

BRS Khammam Public Meeting : నేడు ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ…

HT Telugu Desk HT Telugu
Jan 18, 2023 09:52 AM IST

BRS Khammam Public Meeting జాతీయ పార్టీగా అవతరించిన భారత్‌ రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగసభ కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సిఎం కూడా బిఆర్ఎస్‌ ఆవిర్భావ సభలో పాల్గొంటున్నారు. దాదాపు అయిదు లక్షల మంది సభకు వస్తారనే ఏర్పాట్లు చేశారు.

ఖమ్మంలో బిఆర్ఎస్ బహిరంగ సభ జరుగనున్న ప్రాంగణం
ఖమ్మంలో బిఆర్ఎస్ బహిరంగ సభ జరుగనున్న ప్రాంగణం (HT_PRINT)

BRS Khammam Public Meeting తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఏర్పాటైన టిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత నిర్వహిస్తున్న ఆవిర్భావ సభను భారీఎత్తున సభను నిర్వహించేందుకు బిఆర్‌ఎస్‌ సిద్ధమైంది. పార్టీ జాతీయ ఎజెండాతో పాటు బీజేపీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఏమి చేయబోతుందనే విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం వేదికపై వెల్లడించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు ఖమ్మం సభకు విచ్చేస్తున్నారు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌ చేరుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పాదయాత్రలో ఉండడంతో ఖమ్మం సభకు రావడం లేదు. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ ఇప్పటికే భారాసలో విలీనానికి ముందుకొచ్చింది. ఖమ్మం సభలో దీనిని ప్రకటించే అవకాశం ఉంది.

ఢిల్లీలో నిర్వహించాలని భావించినా…..

బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభను దిల్లీలో నిర్వహించాలని కేసీఆర్‌ మొదట భావించారు. పలువురు నాయకులతో సమాలోచనల తర్వాత తెలంగాణ తొలిదశ ఉద్యమానికి పునాది వేసిన ఖమ్మంలో జరపాలని నిర్ణయించారు. ఖమ్మంలో సభను నిర్వహించాలని 20 రోజుల క్రితం నిర్ణయించారు. .మంత్రి హరీశ్‌రావు పది రోజులగా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలోనే మకాం వేసి, సభాస్థలాన్ని ఎంపిక చేయడం నుంచి ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో తీర్చి దిద్దే వరకు స్వయంగా పర్యవేక్షించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, కోదాడ, తుంగతుర్తి, డోర్నకల్‌, మహబూబాబాద్‌, పాలకుర్తి నియోజకవర్గాలతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి సైతం జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు.

జపాన్ టెక్నాలజీతో సభా వేదిక.....

ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై వెంకటాయపాలెం సమీపంలో 70 ఎకరాల్లో సభను నిర్వహిస్తుండగా ప్రధాన వేదికను జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వేదికపై సీఎం కేసీఆర్‌తో పాటు విజయన్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, అఖిలేశ్‌ యాదవ్‌, డి.రాజా చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై వీరితోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు చోటు కల్పించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రధాన పార్టీల నేతలకు వేదికకు ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా సుమారు 75 వేలకు పైగా కుర్చీలను సిద్ధం చేశారు. ప్రధాన నేతల ప్రసంగాలను వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 50 ఎల్‌ఈడీ తెరలను అమర్చారు. ప్రధాన వేదికకు ఎడమవైపున 20 అడుగుల దూరంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు.

విపక్షాల ఐక్యతే లక్ష్యంగా…..

ఖమ్మం సభ ద్వారా దేశంలో విపక్షాల ఐక్యత సంకేతాలివ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలె స్వయంగా సందర్శించి విపక్ష ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, నేతలతో భేటీ అయ్యారు. సభలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రసంగాల తర్వాత కేసీఆర్‌ తన సందేశం ఇవ్వనున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యాన్ని వివరించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, స్వాతంత్ర్యం తర్వాత 75 ఏళ్లుగా పరిష్కారం కాని ఇబ్బందులు, రాష్ట్రాల మధ్య సమస్యలు తదితర అంశాలపై కేసీఆర్ ప్రసంగిస్తారు. ఖమ్మం సభలోనే జాతీయ పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు.

ఇప్పటికే కేసీఆర్ 'అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌' అనే నినాదాన్ని ప్రకటించారు. ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో పోటీపై స్పష్టత రానుంది. కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తుపై ఇప్పటికే కేసీఆర్ సంకేతాలనిచ్చారు.

ఉదయం యాదాద్రిలో ప్రత్యేక పూజలు….

హైదరాబాద్‌ నుంచి ఉదయం 2 ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎం కేసీఆర్‌తో పాటు జాతీయ నాయకులు యాదాద్రికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.యాదాద్రికి బుధవారం సీఎం కేసీఆర్‌తో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు రానుండడంతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దర్శనాలు, ఆర్జిత పూజలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. సీఎంల పర్యటన పూర్తయ్యేంతవరకు కొండపైకి భక్తులకు అనుమతి లేదని వెల్లడించారు.

యాదాద్రి పర్యటన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మంలో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవానికి ఖమ్మం చేరుకుంటారు. అదే ప్రాంగణంలో 'కంటివెలుగు' రెండో విడత కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులకు కళ్లజోళ్లు అందజేస్తారు. భోజనానంతరం బహిరంగసభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2గంటలకు సభ ప్రారంభం కానుంది.

భారీ భద్రతా ఏర్పాట్లు…..

సభా ప్రాంగణంలో కేసీఆర్‌తో పాటు జాతీయ నాయకుల కటౌట్లు నెలకొల్పారు. ఖమ్మం పట్టణం చుట్టూ 5 కి.మీ. విస్తీర్ణంలో గులాబీ తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండటంతో పాటు భారీగా జనాలు హాజరుకానుండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు డీజీ విజయ్‌కుమార్‌, ఐజీపీ షాన్‌వాజ్‌ ఖాసిం, చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీలు రమేశ్‌నాయుడు, ఎల్‌ఎస్‌ చౌహాన్‌, వరంగల్‌, ఖమ్మం సీపీలు రంగనాథ్‌, విష్ణు వారియర్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణకు 5200 పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తుకు నియమించారు.

IPL_Entry_Point

టాపిక్