Nagoba Jatara 2025 : నాగోబా జాతరకు వేళాయే..! ‘గంగాజలం’ కోసం మెస్త్రం వంశీయుల మహా పాదయాత్ర
Adilabad Nagoba Jatara 2025 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. పుష్య మాసం వచ్చిందంటే నేలవంక చూశాక మేస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవమైన నాగోబాను కొలిచేందుకు సిద్ధమవుతారు.
ఆదివాసీలు తమ దైవాలను కొలిచేందుకు సిద్ధమయ్యారు. మెస్రం వంశీయులు ముందుగా నాగోబా అభిషేకం కోసం సాంప్రదాయ రీతిలో పూర్వకాలం నుండి పాటిస్తున్న ఆచారాలను అదే తరహాలో నిర్వహించేందుకు కార్యచరణను మొదలుపెట్టారు. నాగోబా అభిషేకం కోసం అవసమయ్యే పవిత్ర గంగాజలం కోసం మేస్రం వంశీయులు కాలినడకన పాదయాత్రను ప్రారంభించారు. కేస్లాపూర్ గ్రామంలోని మురాడి దేవాలయం వద్ద సమావేశమై తెల్లని వస్త్రాలు ధరించి, కాలినడకన సాంప్రదాయా రీతిలో గోదావరిలోని హస్తల మడుగు వద్దకు పాదయాత్రగా బయలుదేరారు.

ఉమ్మడి జిల్లాలోని మొత్తం మెస్రం వంశీయులు మురాడి (నాగోబా పురాతన దేవాలయం) వద్ద మెస్రం వంశ పటేల్ మెస్రం వెంకట్ రావ్ అధ్యక్షతన గంగాజలం కోసం పాదయాత్ర చేపట్టారు. ఏడు రోజులపాటు పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే యాత్ర ప్రారంభంకాగా… ఇవాళ ఉదయం సాలెవాడాకు చేరారు. ఇక జనవరి 13న ధర్ముగూడా, 14న కొత్తగూడ, 15న ఉడుంపూర్, 16న మల్లాపూర్ గ్రామానికి చేరుకుంటారు.
గంగమ్మకు పవిత్ర పూజలు….
ఈనెల 17వ తేదీన జన్నారం మండలంలోని కలమడుగు సమీపంలో గల గోదావరి నదిలో హస్తలమడుగు వద్దకు చేరుకుని గోదారమ్మకు పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గంగాజలాన్ని నాగోబా కలశంలో సేకరిస్తారు. అక్కడ గంగమ్మకు మరోసారి పూజలు చేసి అందరూ కలిసి భోజనం చేస్తారు. తిరిగి కేస్లాపూర్ గ్రామానికి పయనం కానున్నారు.
దారిలో ఇంద్రవెల్లిలో ఇంద్రాదేవి వద్దకు పవిత్ర గంగజాల కలిశంతో కుటుంబ సమేతంగా మేస్రం వంశీయులు ఎడ్లబండ్లతో అక్కడకు చేరుకుంటారు. ఈనెల 24న ఇంద్రదేవికి మహాపూజ నిర్వహించి, సాయంత్రం తిరిగి కేస్లాపూర్ గ్రామంలోని మర్రి చెట్ల వద్దకు చేరుకుంటారు. మూడు రోజులపాటు సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఈనెల 28వ తేదీన అర్థరాత్రి అమావాస్య రోజు గోదావరిలోని హస్తలమడుగు నుండి సేకరించి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం నిర్వహిస్తారు. ఆలయాన్ని శుద్ధి చేసి, మహాపూజను ప్రారంభిస్తారు.
నాగోబా మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. నాగోబా జాతర ఏడు రోజులపాటు వైభవంగా కొనసాగనుంది. సాంప్రదాయ రీతిలో మెస్రం వంశీయులు నాగోబా జాతరకు ముందు గంగాజల పాదయాత్ర చేస్తారు. పూర్వకాలం నుండి వస్తున్న కట్టుబాట్లను పాటిస్తుంటారు. కాళ్లకు చెప్పులు ధరించకుండా నెలరోజులపాటు తెల్లని వస్త్రాలు తల పాగలు, సాంప్రదాయ వేషధారణలో ధోతులు ధరించి ఈ క్రతువు పూర్తి చేస్తారు.
ఏర్పాట్లపై కలెక్టర్ కీలక ఆదేశాలు
నాగోబా జాతర ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నాగోబా జాతరకు సంబంధించిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అదనపు ఎస్పీ కాజల్, మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. భక్తులకు మౌలకి వసతులు కల్పించాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు తరలివచ్చే వారికి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్, తెలుగు.
సంబంధిత కథనం