Siddipet Flexi: ఉద్దెర డబ్బులిచ్చేయండి, మా ఆత్మలు శాంతిస్తాయి…చనిపోయిన వారి పేరిట ఫ్లెక్సీలతో కలకలం-arrangement of flexi in siddipet to clear the debt to calm the souls ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Flexi: ఉద్దెర డబ్బులిచ్చేయండి, మా ఆత్మలు శాంతిస్తాయి…చనిపోయిన వారి పేరిట ఫ్లెక్సీలతో కలకలం

Siddipet Flexi: ఉద్దెర డబ్బులిచ్చేయండి, మా ఆత్మలు శాంతిస్తాయి…చనిపోయిన వారి పేరిట ఫ్లెక్సీలతో కలకలం

HT Telugu Desk HT Telugu
Jul 04, 2024 05:54 AM IST

Siddipet Flexi: సిద్దిపేటలో చనిపోయిన దంపతుల పేరిట ఫ్లెక్సీలు కలకలం రేపాయి. తమ ఆత్మలు శాంతించాలంటే.. తీసుకున్న డబ్బుల్ని పిల్లలకివ్వాలని వాటిలో పేర్కొన్నారు.

ఉద్దెర డబ్బుల కోసం ఏఱ్పాటు చేసిన ఫ్లెక్సీ
ఉద్దెర డబ్బుల కోసం ఏఱ్పాటు చేసిన ఫ్లెక్సీ

Siddipet Flexi: సిద్దిపేటలో చనిపోయిన దంపతుల పేరిట ఏర్పాటైన ఫ్లెక్సీలు కలకం రేపాయి. తమ ఆత్మలు శాంతించాలంటే.. తమకు రావాల్సిన డబ్బులు పిల్లలకివ్వాలని కోరుతూ వాటిని ఏర్పాటు చేశారు.

సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన తాడూరి కరుణాకర్, దివ్య దంపతులు తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ,ఇంటి ముందు చిన్న కిరాణా షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు శివ, శశి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

అన్యోన్యంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో విషాదం నెలకొన్నది. నాలుగేళ్ళ క్రితం వ్యవసాయ బావి వద్ద ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కరుణాకర్‌ మృతి చెందాడు. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన దివ్య కూడా అనారోగ్యం పాలైంది.

ఆ తర్వాత పిల్లల కోసం తేరుకొని తమకు జీవనాధారమైన కిరాణా షాపును నడుపుకుంటూ ఇద్దరు కుమారులను పోషించుకుంటుంది. దీంతో కిరాణా షాప్ కు వచ్చిన వారిని కాదనకుండా ఉద్దెరకు సరుకులు ఇచ్చేది. ఎవరైనా చేబదులుగా డబ్బు అడిగితే కాదనకుండా ఇచ్చేది.

ఈ క్రమంలో దివ్య అనారోగ్యానికి గురై ఏప్రిల్ 2న మృతి చెందింది. గతంలో తండ్రి, తర్వాత తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధలైపోయారు. ప్రస్తుతం పిల్లలు నానమ్మ భారతమ్మ,తాతయ్య నర్సయ్య ,బాబాయ్ స్వామి సంరక్షణలో ఉంటున్నారు. తమ కొడుకు,కోడలు బతికుండగా కిరాణా షాపులో ఉద్దెరకు సరుకులు,చేబదులుగా డబ్బులు ఇచ్చారని ఇప్పుడు వారు ఆ డబ్బులు తిరిగిస్తే తమ పిల్లల చదువులకు అవసరం వస్తాయని చెప్పి తల్లితండ్రులు,తమ్ముడు స్వామి, గ్రామంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు.

కరుణాకర్, దివ్య పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో "మేము తెలియజేయునది ఏమనగా నా ద్వారా కిరాణా షాపులో సరుకులు ఉద్దెర తీసుకున్న,చేబదులుగా డబ్బు తీసుకున్న వారికి విన్నపం! దయచేసి అలా తీసుకున్న ప్రతి రూపాయిని మా పిల్లలకు అందజేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం " అభ్యర్ధించారు.

కుటుంబసభ్యులు,బంధువులు కలిసి చనిపోయిన దంపతుల పేరిట గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చగా మారింది. ఆ ఫ్లెక్సీలలో తమ వద్ద తీసుకున్న డబ్బులు తమ పిల్లలకు ఇవ్వాలని.. అప్పుడే తమ ఆత్మకు శాంతి చేకూరుతుందని,కరుణాకర్,దివ్యలు విన్నవించారు.

ఆ పోస్టర్ లను చూసిన గ్రామస్థులు వారి వద్ద అప్పులు తీసుకున్నవారు పిల్లలకు ఇచ్చి వారిని ఆదుకోవాలని మాట్లాడుకుంటున్నారు. అనాథలైన చిన్నారులు శివ,శశి లకు పోలీస్ శాఖ తరుపున సహాయం చేయాలనీ సిద్ధిపేట సీపీ అనురాధ సూచించడంతో చేర్యాల సీఐ శ్రీను పిల్లల నానమ్మ,తాతయ్యలతో మాట్లాడారు.

చదువుల విషయంలో ఏ అవసరం వచ్చినా తప్పకుండ సహాయం చేస్తామని వారికీ హామీ ఇచ్చారు. అనంతరం పిల్లలకు నోట్ పుస్తకాలు,పెన్నులు అందించి బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని వారు సూచించారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner