Yadagirigutta: యాదగిరిగుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆది మానవుల సమాధి, క్రీ.పూ 8,500 చెందిన రాతి పనిముట్లు లభ్యం-archaeological discoveries at brahmanapalli yadagirigutta district evidence of early human settlement ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadagirigutta: యాదగిరిగుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆది మానవుల సమాధి, క్రీ.పూ 8,500 చెందిన రాతి పనిముట్లు లభ్యం

Yadagirigutta: యాదగిరిగుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆది మానవుల సమాధి, క్రీ.పూ 8,500 చెందిన రాతి పనిముట్లు లభ్యం

HT Telugu Desk HT Telugu
Feb 04, 2025 06:14 AM IST

Yadagirigutta:యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి లో చారిత్రక ఆధారాలను బట్టి, ఆ గ్రామం అతిపురాతన కాలం నుండి మానవ వాసంగా ఉన్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం చైర్మన్ రామోజు హరగోపాల్ గుర్తించారు.

బ్రాహ్మణ పల్లిలో ఆదిమానవులు సమాధులు గుర్తించిన చరిత్ర కారులు
బ్రాహ్మణ పల్లిలో ఆదిమానవులు సమాధులు గుర్తించిన చరిత్ర కారులు

Yadagirigutta: యాదగిరి గుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆదిమానవులు సమాధులను తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. గ్రామంలో ఉన్న చరిత్ర ఔత్సాహికుల కోరిక మేరకు, ఆ గ్రామంలో పర్యటించిన, హరగోపాల్ అక్కడ ఉన్నఆది మానవుల సమాధిని కూడా గుర్తించారు. ఈవూర్లో దేవతల గుట్టగా పిలువబడే చిన్నగుట్టల వరుస వుంది.

రెండు గుట్టల నడుమ చిన్నలోయ, లోయలో గుహలు, దొనెలు, సొరికెలు చాలా వున్నాయి. ఒక చిన్నదొనెలో వారికీ మెరుగు పెట్టని చిన్న,చిన్న ఆదిమానవుల రాతిపనిముట్లు దొరికాయి. వాటిలో వడిసెల రాళ్ళు, రాతి సుత్తెలు,గొడ్డళ్ళుగా చేయడానికి సిద్ధపరిచిన రాతి ముక్కలు,బొరిగెల వంటివి వున్నాయి. అక్కడే వేణుగోపాల స్వామి గుడి వుంది.

గుడికి తూర్పున ఆది మానవుల సమాధి....

గుడికి తూర్పున బండ గట్టుగా ఒక ఆదిమానవుల సమాధి వుంది. 16 చిన్నచిన్న రాతి గుండ్లను సమాధి చుట్టు పేర్చారు . అది ఒక కైరన్ సమాధి. ఇంకా సమాధులుండే అవకాశమున్నదని ఇంకా పరిశోధించాలి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

దొరికిన రాతి పనిముట్లను బట్టి అవి మధ్యశిలాయుగం (క్రీ.పూ.8500 సం.లు) నాటివని తెలుస్తున్నది.వేణుగోపాల స్వామి గర్భగుడి సుద్దాలలోని వేణుగోపాల స్వామి గుడి అంతరాళాన్ని పోలి వుంది. ద్వారం ఉత్తరాశి మీద లలాటబింబంగా తిరునామాలే వున్నాయి. నిర్మాణశైలి ఒకేవిధంగా వుంది. గుట్ట మీద కావడం వల్ల గుడి చిన్నగా వుంది. కాని,లోపల అర్చామూర్తులే తప్ప వేణుగోపాల స్వామి విగ్రహం లేదు.

చదవటానికి వీలు లేకుండా శాసనం.…

గుడి బయట ఉత్తరం వైపు బండమీద పెద్ద అక్షరాలతో తెలుగులిపిలో రాత వుంది. జీర్ణమైపోవడం వల్ల చదవడం అసాధ్యంగా వుంది. అక్కడ గుడి బయట తూర్పున కిందవైపు ఒక నంది వుంది. శివలింగం లేదు.అంటే ఇక్కడ కూడా ఒకప్పడు శివాలయం వుండేదని భావిస్తున్నారు. ఇవి కూడా 10,11 శతాబ్దాలనాటివని తోస్తున్నది.

గుడిగోడల్లో కనిపించే స్తంభాలు రాష్ట్రకూట శైలిలో కనిపించడం విశేషం. బ్రాహ్మణపల్లిలో 8,9వ శతాబ్దాలలో నే దేవాలయ నిర్మాణం జరిగిందనిపిస్తుంది. ద్వార శాఖల మీద కనిపించే కలశాలు, ఊరి బయట లభించిన పాదాలు...ఇక్కడ ఒకప్పుడు జైనం వుండేదని తెలిపే ఆనవాళ్ళు కూడా లభించాయి.

పటమట పాత గుడి....

గ్రామంలో పడమట వూరవతల పాత గుడి వుంది. ఆ గుడిలో రెండడుగుల ఎత్తైన చతురస్రాకారపు పానవట్టం, శివ లింగం, అరడుగుల ఎత్తు, అడుగు పొడుగున్న నంది, వినాయక విగ్రహం, అడుగు ఎత్తున్న రాతి పలకపై అభయాంజనేయుని అర్చారూపం, మూడడుగుల ఎత్తున్న చక్కని లక్ష్మీసమేతనారాయణుని విగ్రహం వున్నాయి.

ఈ గుడిని కొండగడప సుబ్బావధాని(ఇప్పటికి ఎన్ని తరాలకిందనో) కట్టించాడట. (ఆ ఇంటి కోడలు గారు చెప్పారు). మాన్యం వుండేదట. అసలు బ్రాహ్మణపల్లే బ్రాహ్మణుల అగ్రహారం కావడం వల్లనే వూరికా పేరు వచ్చి వుంటుంది. స్థానిక చరిత్రలు దొరికితే ఇంకా చరిత్ర ఆనవాళ్ళు ఎక్కువగా లభించేవి. ఆంజనేయుని గుడి వద్ద నాగుల శిల్పాలున్నాయి.పాతగుడి ఆనవాళ్ళు అగుపడుతున్నాయని చరిత్రకారులు వివరించారు.

Whats_app_banner