TGPSC Group 4 : గ్రూప్ 4 అభ్యర్థులకు మరో అప్డేట్ - ఈ తేదీలోపే నియామక పత్రాలు అందజేత..!
TSPSC Group 4 Appointment Letters : తెలంగాణ గ్రూప్ 4 ఉద్యోగాల తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాఖల వారీగా ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎంపికైన వారికి నవంబర్ 25 లేదా 26వ తేదీన నియామకపత్రాలను అందజేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.
తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలనే తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థులు గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే ఎంపికైన వారికి శాఖల వారీగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు.
26న నియామకపత్రాలు..!
గ్రూప్ 4 ఉద్యోగానికి ఎంపికైన వారికి నియామకపత్రాలు ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. భారీ సభను ఏర్పాటు చేసి ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 25 లేదా 26వ తేదీన నియామకపత్రాలు అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మహబూబ్ నగర్ లేదా హైదరాబాద్ లో సభను ఏర్పాటు చేస్తారని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది. నియామకపత్రాలు అందుకునే అభ్యర్థులు శాఖల వారీగా రిపోర్టింగ్ చేస్తారు. దీంతో వారి నియామక ప్రక్రియ పూర్తి కానుంది.
తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలను నవంబర్ 14వ తేదీన టీజీపీఎస్సీ విడుదల చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి జాబితాను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 8,084 మంది అభ్యర్థుతో ప్రొవిజినల్ జాబితాను ప్రకటించింది.
గతేడాది జులైలో గ్రూప్ 4 పరీక్షలను నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావటంతో గ్రూప్4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ప్రకటించింది .
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించిన తర్వాత…. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. తుది ఎంపిక కోసం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. వెరిఫికేషన్ తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ దశలవారీగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో తాజాగా గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే గ్రూప్ 4 అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.