TG SC Categorisation: తెలంగాణలో ఇకపై అడ్మిషన్లలో ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ
TG SC Categorisation: తెలంగాణలో ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అమోదించిన నేపథ్యంలో ఈ ఏడాది అడ్మిషన్లలో వాటిని అమలు చేయాలని నిర్ణయించారు.
TG SC Categorisation: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరించాలని నిర్ణయించారు. పలు ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం తెలంగాణ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యామం డలి జారీ చేసిన నోటిఫికేషన్లకు ప్రభుత్వం నిర్ణయించిన క్యాటగిరీల వారీగా దరఖాస్తులను స్వీకరించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది వరకు తెలంగాణ ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాల్లో 15% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉపకులాలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. మంగళవారం తాజాగా ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అసెంబ్లీ, శాసన మండలి ఎస్సీ వర్గీకరణకు మంగళవారం ఆమోదం తెలిపాయి. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణపై గెజిట్ జారీ చేయాల్సి ఉంటుంది. అది అమల్లోకి వస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ప్రభుత్వం వర్గీకరణ నోటిఫికేషన్ జారీ చేస్తే ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల అవు తుంది. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈలోగా ఎస్సీ వర్గీకరణపై జీవోలు, నోటిఫికేషన్ వెలువడితే 3 గ్రూపుల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈలోపు ఉత్తర్వులు జారీ చేయకపోతే విద్యార్థులు ఉపకులాన్ని ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. అడ్మిషన్ల సమయంలో రిజర్వేషన్ అమలు చేయడానికి వీలుగా కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. తెలంగాణ ఐసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, లాసెట్, ఈసెట్, పీఈ సెట్లలో కూడా వర్గీకరణ వివరాలను సేకరిస్తున్నారు.