ప్రతి రైతు ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ - 'భూ భారతి పోర్టల్'లో డేటా ఎంట్రీ..!-applications received in revenue sadassulu are being registered on the bhu bharati portal in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రతి రైతు ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ - 'భూ భారతి పోర్టల్'లో డేటా ఎంట్రీ..!

ప్రతి రైతు ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ - 'భూ భారతి పోర్టల్'లో డేటా ఎంట్రీ..!

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన‌ ప్ర‌తి ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ చేస్తున్నారు. ఈ వివరాలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అర్హమైన అన్నింటికి సానుకూల ప‌రిష్కారం చూపుతామన్నారు. భూభార‌తి పోర్ట‌ల్ లో ద‌ర‌ఖాస్తుల న‌మోదు ప్ర‌క్రియ పూర్తి కావొచ్చిందన్నారు.

తెలంగాణలో రెవెన్యూ సదస్సులు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు రైతుల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే వీటిని పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేసి… పరిష్కారం చూపనుంది. ఇప్పటికే ఆన్ లైన్ నమోదు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా ప‌రిష్కరించాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తాజాగా అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి ద‌ర‌ఖాస్తుపై స‌రైన విచార‌ణ జ‌ర‌పాల‌ని… సంబంధిత వ్య‌క్తుల‌కు నోటీసులు జారీ చేయాల‌న్నారు. అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు, రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆధారాల‌న్నింటినీ ఒకే డాక్యుమెంట్ గా భూభార‌తి పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

చివరి దశకు డేటా ఎంట్రీ

తిర‌స్క‌ర‌ణ‌కు గురైన ద‌ర‌ఖాస్తుల‌ను ఎందుకు తిరస్క‌రించ‌వ‌ల‌సి వ‌చ్చిందో అనే వివ‌రాల‌ను లిఖిత పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తుదారుల‌కు అందించాల‌ని ఆదేశించారు. రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌పై మంగ‌ళ‌వారం జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. 594 మండ‌లాల్లో 10,226 రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించామ‌న్నారు. ఇందులో 8,27,230 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు 7,98,528 ద‌ర‌ఖాస్తుల‌ను డేటా ఫార్మేట్ లో భూభార‌తి పోర్ట‌ల్ లో న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మిగిలిన‌వాటిని కూడా ఒక‌టి రెండు రోజుల్లో పూర్తిచేస్తామ‌న్నారు.

భూభారతి చ‌ట్టం ద్వారా ద‌శాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌నే ల‌క్ష్యంతో ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వ‌ర‌కు ద‌శ‌ల వారీగా రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. స‌ర్వే నెంబ‌ర్ల‌లో లోపాలు పీపీబీ, ఆర్వోఆర్‌, నాలా, ఆర్ .ఎస్ .ఆర్ స‌వ‌ర‌ణ‌, అప్పీల్స్, కోర్టు కేసులు, పోడుభూములు త‌దిత‌ర 30 ర‌కాల భూ స‌మ‌స్య‌ల‌పై 8.27 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఆర్వోఆర్ చ‌ట్టం 2020 వ‌ల్ల ఇబ్బందులు ప‌డిన తెలంగాణ ప్ర‌జానీకానికి భూ భారతి చ‌ట్టం ద్వారా విముక్తి క‌ల్పిస్తామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు. కింది నుంచి పై స్ధాయి వ‌ర‌కు మొత్తం రెవెన్యూ యంత్రాంగం ప్ర‌త్యేక ఎజెండాగా తీసుకొని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.