Wedding Dates : తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి, ఈ రెండు నెలలూ ఊరూరా బాజాలే!-ap telangana wedding dates marriage ceremonies starts shopping malls function halls full with people ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ap Telangana Wedding Dates Marriage Ceremonies Starts Shopping Malls Function Halls Full With People

Wedding Dates : తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి, ఈ రెండు నెలలూ ఊరూరా బాజాలే!

Bandaru Satyaprasad HT Telugu
May 04, 2023 12:14 PM IST

Wedding Dates : తెలుగు వారింట పెళ్లంటే ఓ పండుగ. బంధువు, స్నేహితులతో ఎంతో సందడిగా ఉంటుంది. మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది.

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి (Pixabay )

Wedding Dates : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందళ్లు మొదలయ్యాయి. మే, జూన్ నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో బ్యాచిలర్ బాబులు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికే పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకుని ముహూర్తాల కోసం వెయిట్ చేస్తున్న వారికి మంచిరోజులు వచ్చాయి. ఈ రెండు నెలలూ ఊరూరా పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి సందడి అంటే మామూలు వ్యవహారం కాదు. అసలే తెలుగు వారి ఇంట పెళ్లి సందడి అంటే హడావుడితో పాటు చాలా ఖర్చుతో పని. పెళ్లి చూపులు నుంచి నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి వరకూ ఎంతో చాలా పనులు ఉంటాయి. పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన దగ్గర నుంచి పనులు స్టార్ అవుతాయి. పెళ్లి కార్డులు ప్రింటింగ్, పెళ్లి మండపం బుకింగ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఫొటో, వీడియో గ్రాఫర్స్ బుకింగ్, వంట మనుషులు, డెకరేషన్ ఇలా చాలా పనులు ఉంటాయి. పెళ్లితో ముడిపడి ఉన్న ప్రతీది ముందస్తుగా బుక్ చేసుకోవాల్సిందే. తెలుగువారికి పెళ్లంటే ఓ పండుగలాంటిది. బంధువులు, స్నేహితుల హడావుడితో ఇళ్లంతా ఎంతో సందడిగా ఉంటుంది.

ముహూర్తాలు ఇలా?

పెళ్లిళ్లు కుదిరినా ముహూర్తాలు లేకపోవడంతో పెండింగ్ లో ఉన్నాయి. మార్చి 28 నుంచి గురు మూఢమితో పెళ్లిళ్లు నిలిచిపోయాయి. ఈ నెల 3వ తేదీతో మూఢమి పూర్తవడంతో తెలుగింటి మళ్లీ పెళ్లి బాజాలు మొదలయ్యాయి. మే, జూన్‌ నెలల్లో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. జూన్‌ 14వ తేదీ వరకూ ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 14 తర్వాత శుక్ర మూఢమి వల్ల ఆగస్టు 18వ తేదీ వరకు శుభ ముహుర్తాలు లేవని పండితులు అంటున్నారు. మే నెలలో 3, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14, 20, 21, 26, 27, 31 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. జూన్‌ నెలలో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 14 తేదీల్లో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.

ముందస్తు బుకింగ్స్

మే, జూన్ నెలలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు బుకింగ్‌లు చేసుకునే పనిలో పడ్డారు. వెడ్డింగ్ అంటే ఎంతో మందికి ఉపాధి. పెళ్లి కార్యక్రమానికి అనుబంధంగా ఎన్నో రంగాలు ముడిపడి ఉన్నాయి. పెళ్లి మండపాలతో పాటు ఈవెంట్ మేనేజ్ మెంట్లు, ఫొటో, వీడియో గ్రాఫర్స్ ఈ సీజన్ లో కాస్త ఎక్కువ పారితోషకం చెబుతారు. దీంతో పెళ్లిళ్లకు భారీ ఖర్చులు తప్పవు. ప్రస్తుతం చిన్న ఫంక్షన్‌ హాల్‌కు లక్ష రూపాయల వరకు అద్దెను వసూలు చేస్తుండగా వీడియో గ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌లు లక్షకు పైచిలుకు పారితోషకం చెబుతున్నారు. ఇక డెకరేషన్ , లైటింగ్ అయితే వాళ్లు చెప్పిన ధరకే ఒప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

బంగారం, వస్త్ర దుకాణాలు కిటకిట

పెళ్లి సందడిలో వస్త్ర, బంగారు దుకాణాలతో కీలకపాత్ర. ఇంట్లో పెళ్లంటే అందరికీ కొత్త బట్టలు తీసుకోవడం తెలుగువారి సంప్రదాయం. బంధువులకు కూడా నూతన వస్త్రాలు పెడుతుంటారు. దీంతో ఈ రెండు నెలలు చిన్న వస్త్ర దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కిటకిటలాడుతుంటాయి. పెళ్లితంతులో మరో కీలక పాత్ర బంగారంది. పెళ్లితాళి మొదలుకొని పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఇరు కుటుంబాలు పెట్టే బంగారు ఆభరణాలు చాలానే ఉంటాయి. ఇప్పటికే బంగారం ధరలు కొండెక్కాయి. మే, జూన్ నెలల్లో బంగారం ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60 వేలకు పైగా ఉంది.

IPL_Entry_Point