AP TG Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు, హైదరాబాద్ వెదర్ ఛేంజ్
AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణ శాఖ.
AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం...ఇవాళ ఉదయము 8.30 గంటలకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.
ఏపీలో ఈ నెల 27వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం మరింత బలపడిందని, సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. నైరుతి వైపుగా కదులుతున్న అల్పపీడనం..రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ఎఫెక్ట్ తో నేడు, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణలో వాతావరణం ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో కూల్ వెదర్
హైదరాబాద్ లో వాతావరణం మారింది. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత పెరిగింది. ఈ నెల మొదటి వారంతో పోలిస్తే చలి కాస్త తగ్గినా...అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పు కనిపించింది. డిసెంబర్ నెలఖారకు సాధారణంగా చలి తీవ్ర అధికంగా ఉంటుందని, సంక్రాంతి తర్వాత వాతావరణంలో మార్పులు వస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే అల్పపీడనం ప్రభావంతో వాతావరణం కూల్ గా మారింది. చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారి ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సంబంధిత కథనం