Mlc Election Results : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తెలంగాణలోని కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఎలిమినేషన్ లేకుండానే మొదటి ప్రాధాన్యత కావాల్సిన కోటా కింద 12081 కంటే ఎక్కువ ఓట్లు సాధించారు కొమురయ్య. ఇప్పటి వరకు 24,144 ఓట్లు లెక్కింపు పూర్తి కాగా బీజేపీ అభ్యర్థి కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్ కు 2621, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి.
కరీంనగర్-మెదక్- నిజామాబాద్ -ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం 25,041 ఓట్లు పోలవ్వగా..వీటిలో 24144 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 897 ఓట్లు చెల్లనవి ఉన్నాయి. గెలుపు కోటా ఓట్లు 12,073 గా నిర్దారించారు. వీటిలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు పోల్ అయ్యాయి.
నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ గా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈయన గెలుపొందారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. గాదె శ్రీనివాసులకు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. వెయ్యికి పైగా ఓట్లు చెల్లనవిగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విజేతను డిసైట్ చేసే ప్రక్రియలో 8 మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చిందన్నారు.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 17,246 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 7156 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ ముగిసేసరికి ఆలపాటి రాజా 30,065 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌లో ఆలపాటికి 17,246 ఓట్లు, రెండో రౌండ్‌లో 17,506 ఓట్లు, మూడో రౌండ్‌లో 16,722 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కేఎస్ లక్ష్మణరావు తొలి రౌండ్‌లో 7,156, రెండో రౌండ్‌లో 6,710, మూడో రౌండ్‌లో 7403 చొప్పున ఓట్లు వచ్చాయి. మొత్తంగా తొమ్మిది రౌండ్‌లు కాగా ఒక్కో రౌండ్‌లో 28 వేల ఓట్లు చొప్పున లెక్కిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 243 పోస్టల్ బ్యాలెట్లకు గాను 201 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లగా, 42 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. బ్యాలెట్లను కట్టలు కట్టేందుకు 12 గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 2,18,902 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 8 రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నారు. రాత్రి 10.30గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కౌంటింగ్ అధికారులు తెలిపారు. మొత్తం 700 మంది కౌంటింగ్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.
సంబంధిత కథనం