AP TG Liquor Sales : మందుబాబులా మజాకా!-ఏపీ, తెలంగాణలలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్
AP TG Liquor Sales : న్యూ ఇయర్ వేడుకల పేరిట తెలుగు రాష్ట్రాల మందుబాబు రూ.కోట్ల మద్యం ఊదేశారు. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే రూ.520 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగ్గా, ఏపీలో రూ.113 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.
AP TG Liquor Sales : తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేళ మద్యం ఏరులై పారింది. తెలంగాణ, ఏపీలో డిసెంబర్ చివరి వారం ముఖ్యంగా 31వ తేదీన మద్యం అమ్మకాలు కోట్లలో జరిగాయి. తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో సుమారు రూ.520 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. డిసెంబర్ 30న రూ.402 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో సుమారు రూ.1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
తెలంగాణలో మందుబాబులు 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. మద్యంలో మునిగితేలుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో సుమారు రూ. 3,800 కోట్ల పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగినట్లు సమాచారం. ఈ రెండు రోజుల్లో సుమారు వెయ్యి కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. డిసెంబర్ 30న రూ.402 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, డిసెంబర్ 31న రాత్రి 10 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం సుమారు రూ. 520 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రాత్రి 12గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఉండడంతో...ఈ లెక్క మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
రోజుకు రూ.150-200 కోట్ల అమ్మకాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో 38 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరగ్గా, 45 లక్షల బీర్ కేసులు విక్రయించినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రతీ రోజు రూ.150 నుంచి రూ. 200 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ లెక్కలు చెబుతున్నాయి. డిసెంబర్ నెలలో సేల్స్ ఈ లెక్కలను దాటిపోయాయని అధికారులు అంటున్నారు. న్యూఇయర్ వేడుకల పేరుతో మందుబాబులు ప్రభుత్వ ఖజానా నింపే ప్రయత్నం చేశారు.
ఏపీలో మద్యం అమ్మకాలు
నూతన సంవత్సరం వేడుకల పేరుతో కేసులకు కేసుల మద్యాన్ని మందుబాబులు ఖాళీ చేశారు. ఏపీలో మద్యం ధరలు తగ్గడం, రూ.99లకే క్వార్టర్ మందు దొరకడంతో....మందుబాబుల్లో జోష్ పెరిగింది. డిసెంబర్ 31న ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేందుకు మందుబాబులు పోటీపడ్డారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.331.84 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 31వ తేదీ కంటే 30వ తేదీన ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 30వ తేదీన రూ.219 కోట్ల మద్యం అమ్మకాలు జరిగగా, 31వ తేదీన రూ.113 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయని ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల్లో 4,08,296 కేసుల లిక్కర్ సేల్స్ జరగ్గా.. 16,1271 బీరు కేసులు అమ్ముడయ్యాయి.
ఏపీలో ఇటీవల 11 కంపెనీలు మద్యం ధరలను తగ్గించాయి. కూటమి పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత మద్యం పాలసీ అందుబాటులోకి తెచ్చాయి. క్వాలిటీ మద్యం, నచ్చిన బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులో ఉంచాయి. దీంతో గతంలో క్వాలిటీ మద్యం కోసం తెలంగాణపై డిపెండ్ అయ్యే మందుబాబు...ఏపీలోనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో మద్యం అమ్మకాలు కాస్త తగ్గాయి. తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. గతంలో తెలంగాణ మద్యం కోసం బోర్డర్ దాటి వెళ్లవారు. ఇప్పుడు ఏపీ మద్యాన్నే ప్రిఫర్ చేస్తు్న్నారు మందుబాబులు. దీంతో తెలంగాణ మద్యం అమ్మకాలు తగ్గాయనే తెలుస్తోంది.
సంబంధిత కథనం