AP TG Floods : ప్రాణాలకు తెగించి వరదల్లో సాయం-రియల్ హీరోలకు సెల్యూట్-ap telangana flood serious condition real hero saves many life many organization supplying food ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Tg Floods : ప్రాణాలకు తెగించి వరదల్లో సాయం-రియల్ హీరోలకు సెల్యూట్

AP TG Floods : ప్రాణాలకు తెగించి వరదల్లో సాయం-రియల్ హీరోలకు సెల్యూట్

Bandaru Satyaprasad HT Telugu
Sep 02, 2024 10:41 PM IST

AP TG Floods :పోతే ఒక్కడినే, వస్తే పది మందిమి అంటూ ప్రాణాలు లెక్కచేయని జేసీబీ డ్రైవర్, సాటి మనిషి కోసం తమ ప్రాణాలు లెక్క చేయని పోలీసులు, వందల మంది ఆకలి తీర్చిన స్వచ్ఛంద సంస్థలు.... ఇలా ఈ ఆపద సమయంలో ఎంతో మంది రియల్ హీరోలు ఉన్నారు.

సాటి మనిషి కోసం ప్రాణాలు లెక్కచేయని వైనం- రియల్ హీరోలకు సెల్యూట్
సాటి మనిషి కోసం ప్రాణాలు లెక్కచేయని వైనం- రియల్ హీరోలకు సెల్యూట్

AP TG Floods : తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. చాలా ప్రాంతాలు వరద నీటి మునిగిపోయాయి. ప్రజలు ఇళ్ల పైకెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాగులు దాటుతూ కొందరు, గొర్రెల కాపరులు, కాలనీల్లో చిక్కుకున్న వారు... సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తెలంగాణలో 16 మంది, ఏపీలో 15 మంది జలప్రళయానికి బలైపోయారు. ఇళ్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయి లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తక్షణమే స్పందించినా... ప్రకృతి విలయతాండవం ముందు నిలువలేకపోతున్నాయి. ఈ విపత్కర సమయంలో సాటి మనిషికి సాయం చేసేందుకు జనం కదిలారు. వరద బధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వరదబాధితులను కాపాడేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వాలంటీర్లు రాత్రింబవళ్లు ప్రాణాలు లెక్కచేయకుండా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు, పలు సంస్థలు, నేతలు... బాధితులకు ఆహార పదార్థాలు, మంచినీరు అందిస్తున్నారు.

సెల్యూట్ డ్రైవరన్న

పోతే నేను ఒక్కడిని.. వస్తే మేము పది మంది అంటూ ప్రాణాలకు తెగించిన ఓ జేసీబీ డ్రైవర్ వరద బాధితులను రక్షించాడు. ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మందిని ప్రాణాలకు తెగించి జేసీబీతో వెళ్లి కాపాడాడు. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. విశాఖ నుంచి నేవీ హెలికాప్టర్‌ రప్పించిన రాత్రి అవ్వడంతో వాళ్లు కూడా చేతులెత్తేశారు. అప్పటికే 9 గంటలుగా బాధితులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి 9 మందిని కాపాడలేకపోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితులను రక్షించేందుకు స్థానికులు జేసీబీని రప్పించారు. అయితే గర్జిస్తున్న మున్నేరు వాగుపై వరద నీటిలో వెళ్లి 9 మందిని రక్షించాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఎవరు వెళ్తారు అని అందరూ తర్జనభర్జన పడుతున్న సమయంలో ఓ జేసీబీ డ్రైవర్ ముందుకొచ్చాడు. చీకట్లో వద్దు.. చాలా ప్రమాదమంటూ అధికారులు వారించినా.. పోతే ఒక్కన్నే, వస్తే పది మందిమి అంటూ ముందుకు కదిలాడు. ఎంతో జాగ్రత్తగా వెళ్లి తొమ్మిది మందిని రక్షించి బయటకు తీసుకొచ్చి రియల్ హీరోగా నిలిచాడు. ఆ రియల్ హీరో పేరు సుభన్ ఖాన్.

పోలీసులకు సలాం

నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా తక్షణమే స్పందించి, తమ ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడు హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాములు. వీరిద్దరినీ జిల్లా ఎస్పీ, డీజీపీ అభినందించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగనూల్ వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి నీటిలో పడిపోయాడు. పక్కనే ఉన్న సపోర్టును పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. బాధితుడ్ని గమనించిన ఇద్దరు కానిస్టేబుల్స్ మోకాలి లోతు నీటిలో చేయి చేయి పట్టుకుని బాధితుడ్ని రక్షించారు. ఆపద సమయంలో మేమున్నామంటూ పోలీసులు సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రాణాలకు తెగించి బాధితులను రక్షిస్తున్నారు.

అక్షయపాత్ర రికార్డు

విజయవాడను వరద ముంచెత్తింది. చాలా కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆదేశాలతో వరద బాధితులకు ఆహారం అందించేందుకు మంగళగిరిలోని అక్షయ పాత్ర రంగంలోకి దిగింది. ఒకే రోజు 3 లక్షల మందికి ఆహారం తయారుచేసి అందించింది. 3 లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి బాధితులకు పంపిణీ చేశారు. అక్షయపాత్ర సర్వీసులో ఇదే రికార్డు అని నిర్వాహకులు తెలిపారు. అయితే 1.70 లక్షల ఆహార ప్యాకెట్స్ అయ్యే వ్యయాన్ని దివీస్ సంస్థ భర్తిస్తుందని ఆ సంస్థ ఎండీ మురళీ కృష్ణ వెల్లడించారు. అయిదు రోజుల పాటు బాధితులకు ఆహారం అందిస్తామని చెప్పారు.

విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు సైతం... తోటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. విజయవాడలోని పలు హోటళ్లు బాధితుల కోసం భోజనాలు సిద్ధం చేసి అందిస్తున్నాయి.

సంబంధిత కథనం