AP Deputy CM Pawan : నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు-ap deputy cm pawan kalyan will visit kondagattu temple today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Deputy Cm Pawan : నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు

AP Deputy CM Pawan : నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Jun 29, 2024 06:42 AM IST

Deputy CM Pawan Kondagattu Tour Updates: నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టుకు రానున్నారు. అంజన్నను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP Deputy CM Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.  ఇవాళ ఉదయం 11గంటలకు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు.  ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 

పవన్ కల్యాణ్ టూర్ నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు…. కొండగట్టులో ఏర్పాట్లపై సమీక్షించారు. పవన్ కల్యాణ్ టూర్ కు సంబంధించి శుక్రవారం ఆలయ EOను కలిసి పలు అంశాలపై చర్చించారు.  తగు జాగ్రత్తలు తీసుకొని కొండగటు ఆలయ ప్రాంతంలో ప్రయాణం చేయాలని కార్యకర్తలు, అభిమానులను కోరారు.

దీక్షలో పవన్….

ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ‘వారాహి’ అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో భాగంగానే కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.

పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న టెంపుల్ ఓ సెంటిమెంట్..! 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్‌కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పింది. హైటెన్షన్ వైర్లు పడిన ఘటనలో పవన్… బయటపడ్డారు. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇలవేల్పుగా ఆరాధిస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా… అక్కడ్నుంచే మొదలుపెడుతున్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే తాను ప్రాణాలతో బయటపడ్డానని…పలుమార్లు కూడా పవన్ గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి.

జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ వారాహి విజయ దీక్ష కొనసాగనుంది. ఈ సమయంలో ఆయన పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకుంటారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్ లో వారాహి విజయయాత్రను ప్రారంభించి వారాహి అమ్మవారికి పూజలు, ఆ తర్వాత దీక్ష చేశారు. రాష్ట్ర, ప్రజల సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు పొందేందుకే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వారాహికి ఇక్కడే పూజలు….

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించారు పవన్. ఈ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న సన్నిధిలోనే నిర్వహించారు. పవన్ కల్యాణ్ కూడా ఈ పూజలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈసారి జరిగిన ఎన్నికల్లోనూ పవన్ సంచలనం సృష్టించారు. పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీ చేసిన 21 మంది విజయం సాధించారు. పవన్ కూడా పిఠాపురం నుంచి భారీ విక్టరీని కొట్టి…తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. మంత్రి హోదాలో కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

పిఠాపురం పర్యటన ఖరారు….

పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జులై 1వ తేదీన పలు ప్రాంతాల్లో పర్యటన సాగనుంది. పిఠాపురం వేదికగా వారాహి సభలో పాల్గొననున్నారు. పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేలా ఈ సభను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై పవన్ సమీక్షించనున్నారు. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆరా తీయనున్నారు.

Whats_app_banner