Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత-ap cm chandrababu got big relief in supreme court denied to transfer cid to cbi cases ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత

Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత

HT Telugu Desk HT Telugu
Jan 28, 2025 09:40 PM IST

Chandrababu Cases : ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల విచారణను సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. పిటిషనర్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌,  కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత
సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత

Chandrababu Cases : సుప్రీం కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసుల విచార‌ణ‌ను సీఐడీ నుంచి సీబీఐకి బ‌దిలీ చేయాల‌న్న పిటిష‌న్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మ‌రోవైపు పిటిష‌న‌ర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క మాట మాట్లాడినా భారీ జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చరించింది.

yearly horoscope entry point

గ‌త వైసీపీ ప్రభుత్వ హ‌యంలో అప్పటి ప్రతిప‌క్ష నేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇసుక‌, ఇన్నర్ రింగ్ రోడ్డు, మ‌ద్యం, స్కిల్ డెవల‌ప్‌మెంట్ త‌దిత‌ర ఏడు కేసుల‌ను న‌మోదు చేసింది. ఆ కేసుల‌ను అప్పటి నుంచి రాష్ట్రంలోని సీఐడీ దర్యాప్తు జ‌రుపుతోంది.

సీఐడీ నుంచి సీబీఐకి

అయితే గత ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలో వ‌చ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయ‌న కేసుల విచార‌ణ‌ను ప్రభావితం చేసే అవ‌కాశం ఉందని భావించి, సీఐడీ విచార‌ణ‌లో ఉన్న కేసుల‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ)కి బ‌దిలీ చేయాల‌ని కోరుతూ హైకోర్టు న్యాయ‌వాది బి. బాల‌య్య సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌ను మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ బాలచంద్ర వరాలేల‌తో కూడిన ద్విస‌భ్య ధర్మాసనం విచారించింది. పిటిష‌న‌ర్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది మ‌ణీంద‌ర్ సింగ్ వాద‌న‌లు వినిపించేందుకు ప్రయ‌త్నించారు. ధ‌ర్మాస‌నం జోక్యం చేసుకుని ఇది పూర్తిగా అవసరంలేని పిటిష‌న్‌ అని పేర్కొంది. అయితే సీనియ‌ర్ న్యాయ‌వాది మ‌ణీంద‌ర్ సింగ్ ఆగకుండా వాద‌న‌లు వినిపించ‌డానికి సిద్ధమయ్యారు. దీంతో ఆయ‌న‌పై ధ‌ర్మాస‌నం అస‌హ‌నం వ్యక్తం చేసింది.

పిటిషనర్ పై సీరియస్

ఈ పిటిషన్‌కు సంబంధించిన ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామ‌ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్‌ను ధ‌ర్మాస‌నం కొట్టివేసింది.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు కూడా వెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులు చంద్రబాబు ఉన్నారు. అనంత‌రం ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల అయ్యారు. మిగిలిన ఇత‌ర‌ కేసుల్లో సీఎం చంద్రబాబుకు ముంద‌స్తు బెయిల్ వ‌చ్చింది. తాజాగా సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. సీఐడీ విచార‌ణ‌లో ఉన్న సీఎం చంద్రబాబుపై కేసుల‌ను సీబీఐకి బ‌దిలీ చేయాల‌న్న పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner