Employees Transfers : అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం-ap cm approves to government employees mutual state transfers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ap Cm Approves To Government Employees Mutual State Transfers

Employees Transfers : అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

B.S.Chandra HT Telugu
Sep 10, 2022 11:56 AM IST

అంతర్రాష్ట్ర బదిలీలకు ఏపీ ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. గ్రూప్‌ సి,డి క్యాటగిరీల్లో ఉద్యోగుల్లో చాలామంది పరస్పర బదిలీల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల పంపకాల్లో 58 : 42 లెక్కల్లో పంపకం చేయడంతో చాలామంది ఉద్యోగులు శాఖల వారీగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు ఆరేళ్లుగా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఏడాదిన్నర క్రితం తొలి విడత సిబ్బందిని సొంత రాష్ట్రాలకు పంపగా మిగిలి ఉన్న వారిని సొంత రాష్ట్రానికి పంపేందుకు జగన్ అమోదం తెలిపారు.

ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలకు సీఎం జగన్ అమోదం
ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలకు సీఎం జగన్ అమోదం

ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కోరుతున్నారు. విభజన సమయంలో ఉద్యోగుల బదిలీ సందర్భంగా చాలామంది సొంత రాష్ట్రాలకు దూరమయ్యారు. కుటుంబాలను వదిలి ఒంటరిగా ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి. ఏపీలో తెలంగాణ ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో, తమను సొంత రాష్ట్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ కోరుతున్న ఉద్యోగుల వివరాలు సేకరించాయి.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 1338 మంది ఉద్యోగులు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలతో జిఏడి రాష్ట్ర పునర్విభజన శాఖ వారు ప్రతిపాదన రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే అప్పుడు బదిలీలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి బదిలీల ప్రక్రియ చేపడుతారు. అలాగే తెలంగాణకు బదిలీ కోరుకునే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇపుడు నిరభ్యంతర పత్రాలను జారీ చేస్తోంది.

త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీలలో తప్పనిసరి బదిలీకి ఎనిమిది సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపింది.

WhatsApp channel

టాపిక్