Hyderabad : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య-another youth commits suicide in telangana due to online betting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య

Hyderabad : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య

Hyderabad : బెట్టింగ్ భూతం మరో యువకుడిని బలి తీసుకుంది. డబ్బులు పోయాయని మనోవేదనకు గురైన యువకుడు.. రైలు పట్టాలపై పడుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సోమేశ్ (ఫైల్ ఫొటో)

క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని సోమేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌడవెల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్.. క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. మనోవేదనతో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

విదేశీ సర్వర్లలో..

చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటారు. ఈ వెబ్‌సైట్‌లు, యాప్‌లు మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల పనితీరు, ఇతర అంశాలపై పందెం వేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. ఈ వెబ్‌సైట్‌లు, యాప్‌లను విదేశీ సర్వర్‌లలో హోస్ట్ చేస్తారు. దీంతో వీటిని గుర్తించడం, నియంత్రించడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలో నిషేధం..

తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధం. దీనికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడడం వలన ఆర్థికంగా, సామాజికంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ బెట్టింగ్ కారణంగా.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది అప్పులపాలై, ఆర్థికంగా చితికిపోతున్నారు. బెట్టింగ్ వ్యసనంగా మారి కుటుంబాల్లో కలహాలకు దారితీస్తోంది. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి.

దూరంగా ఉండాలి..

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బెట్టింగ్ గురించి ఎవరైనా ప్రలోభపెడితే సమాచారం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రముఖ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు సహా 19 మంది బెట్టింగ్ యాప్ యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ప్రమోటర్స్‌పై ఫోకస్..

ఈ వ్యవహారంలో స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్ వంటి ప్రముఖ హీరోలపైనా పోలీసులకు ఫిర్యాదు అందింది. యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యాంకర్ విష్ణుప్రియ కూడా ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ యజమానులే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం