హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. జీ ప్లస్ 2 బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. జీ ప్లస్ 2 బిల్డింగ్ లోని.. సెకండ్ ఫ్లోర్ చెప్పుల గోదాం ఉంది. సరకును నిల్వ చేసుకుంటున్నారు ఆ ఫ్లోర్‌లో మంటలు వచ్చాయి. పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి.
స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అంతా రబ్బర్ కావటంతో ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ కమ్మేసింది. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించటంతో.. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన భవనం పక్కనే మరో బిల్డింగ్ కూడా ఉంది. మంటలు అదుపు చేయటం ఆలస్యం అయితే.. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం భారగా జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు, అగ్నిమాపక సిబ్బంది విచారణ చేస్తున్నారు.
రెండ్రోజుల కిందట గుల్జార్ హౌస్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మెయిన్ ఎలక్ట్రికల్ ప్యానెల్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీని వల్ల వచ్చిన మంటలు చెక్క ప్యానెల్ ద్వారా వ్యాపించి, ఒక ఏసీ కంప్రెషర్ పేలడానికి కారణమయ్యాయి.
విద్యుత్ శాఖకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇది షార్ట్ సర్క్యూట్ కాదని, ఏసీ కంప్రెషర్ వేడెక్కడం లేదా తప్పుగా వైరింగ్ చేయడం వల్ల పేలి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ అయితే ట్రాన్స్‌ఫార్మర్ స్థాయిలో ట్రిప్ అయి ఉండేదని ఆయన వివరించారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఎర్రటి మంటలను చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఎరుపు రంగు మంటలు రసాయనాలు లేదా కలప పనులు జరుగుతున్న చోట వస్తాయని వివరించారు. అక్కడ ముత్యాలు, రత్నాల దుకాణాలు ఉండటం, కలప పనులు జరుగుతుండటం వల్ల మంటలు తీవ్రంగా వ్యాపించాయని చెబుతున్నారు.
సంబంధిత కథనం