Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త.. ఇకనుంచి ఇంటివరకూ సేవలు!
Hyderabad Metro : ప్రయాణికులకు మెట్రో మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికులు స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరుకోవడాన్ని సులభతరం చేసింది. కాలుష్య రహిత వాహనాలను.. మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేసింది. దీంతో మెట్రో నుంచి ఇళ్లు, కార్యాలయం, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదు.
దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద రవాణా వ్యవస్థ హైదరాబాద్ మెట్రో. అత్యంత వేగంగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అయితే.. మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు స్టేషన్లకు చేరుకోవడానికి, స్టేషన్ల నుంచి ఇంటికి వెళ్లడానికి సొంత వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌లను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ కష్టాల కారణంగా సమయానికి చేరుకోవడం లేదు. ఈ సమస్యలకు హైదరాబాద్ మెట్రో పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.

అందుబాటులో ఈవీ వెహికిల్స్..
హైదరాబాద్ మొట్రో ఫస్ట్, లాస్ట్ కనెక్టివిటీల వద్ద ఈవీ వాహనాలను అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వాహనాలను మెట్రో ఎండీ ప్రారంభించారు. ఈ వాహనాలను నడపడానికి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ట్రాఫిక్‌లోనూ వాహనాలను నడిపేలా మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవింగ్‌లో ఐదుగురు మహిళలకు శిక్షణ ఇచ్చామని, భవిష్యత్తులో 100 మంది వరకు శిక్షణ ఇస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.
మహిళలకు శిక్షణ..
మహిళలు, పురుషులకు శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల పరిధి వరకు ఈ వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. దీని ద్వారా అటు మెట్రో ప్రయాణికులకు, ఇటు శిక్షణ పొందిన మహిళలకు మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈవీ జిప్ సహా.. 9 సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మహిళల కోసం..
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం రోజూ దాదాపు 5 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. వారిలో లక్షా 25 వేల మందిని ఆయా సంస్థల వాహనాలు గమ్య స్థానాలకు చేరుస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం మహిళలే నడిపేలా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని తాజాగా ప్రారంభించారు. ఇప్పటికే ఇవి కొన్ని స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని స్టేషన్లకు వీటిని విస్తరించనున్నారు.
స్టార్టప్‌లకు ఆహ్వానం..
ఈవీ జిప్ వాహనాలతో ప్రశాంతంగా ఇంటికి చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. ఇంకా ఆసక్తి ఉన్న కంపెనీలతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మెట్రో అధికారులు ప్రకటించారు. మరిన్ని సంస్థలు ముందుకొచ్చి తమ ఆలోచనలను పంచుకొని మెట్రోతో కలిసి పనిచేయొచ్చని స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా చాలామందికి ఉపాధి, ప్రయాణికులకు సౌకర్యం సాధ్యమవుతుందని వివరిస్తున్నారు.