Nalgonda District Voters : ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల - ఉమ్మడి నల్గొండ జిల్లా లెక్కలివే-announcement of draft list of voters of combined nalgonda district 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda District Voters : ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల - ఉమ్మడి నల్గొండ జిల్లా లెక్కలివే

Nalgonda District Voters : ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల - ఉమ్మడి నల్గొండ జిల్లా లెక్కలివే

HT Telugu Desk HT Telugu
Nov 01, 2024 06:14 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. జిల్లాలో 29.64 లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యలో పెరుగుదల ఉంది.

నల్గొండ జిల్లా ఓటర్లు
నల్గొండ జిల్లా ఓటర్లు

కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన మొదలు పెట్టింది. రెండు రోజుల కిందట ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజుల కిందటే సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించింది. అయితే, యువతకు ఓటు హక్కు కల్పించేందుకు, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు 18 ఏళ్లు నిండే వారికి వచ్చే ఏడాది (2025) జనవరి వరకు అవకాశం కల్పిస్తోంది. 

సుమారు మూడు నెలల పాటు చేపట్టిన ఓటరు జాబితా సవరణ తర్వాత ముసాయిదా జాబితా మేరకు ఉమ్మడి జిల్లాలో (నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి)ని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 29,64,913 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ జాబితాలోని తప్పులను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పెట్టింది. ఈ నెల 24వ తేదీలోపు అభ్యంతరాలను, తప్పులు, పొరపాట్లను సవరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.

పెరగనున్న ఓటర్లు…

జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి, ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన నాటికి ఓటర్ల సంఖ్య పెరిగింది. వచ్చే ఏడాది జనవరి దాకా ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొత్తంగా మూడు ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలకు అతీతంగా జరిగే గ్రామ పంచాయతీలతో పాటు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో అర్హులైన వయోజనులందరూ ఓటును నమోదు చేసుకునేలా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 

ఒక్క నల్గొండ జిల్లా విషయానికి వస్తే.. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు.. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, నల్గొండ, మునుగోడు, నకిరేకల్ ల పరిధిలో 38,123 మంది ఓటర్లు పెరిగారు. వార్షిక ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఓటర్ల జాబితాలో తొలగింపులు, చేర్పులు తదితర సవరణలు చేపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఆరు నియోజకవర్గాల్లో 16.64 లక్షల మంది ఓటర్లు ఉండగా.. జాబితా సవరణ తర్వాత అది 15.02 లక్షలకు చేరింది. 

జనవరి 6వ తేదీన తుది జాబితా ప్రకటన వరకు ఒక్క నల్గొండ జిల్లాలోనే సుమారు లక్ష దాకా ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను ద్రుష్టిలోకి తీసుకుని.. కొత్త ఓటర్లను చేర్పించే పని జోరుగా సాగుతోంది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారి పేర్లను కూడా చేర్పించే పనిలో ఆయా గ్రామాల నాయకులు ఉన్నారు.

మహిళా ఓటర్లే అధికం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య ముప్పై లక్షల మార్క్ దాటడం ఖాయమని అధికార యంత్రాంగం అంచనాల్లో ఉంది. ముసాయిదా జాబితా ప్రకారమే ప్రస్తుతం 29,64,913 మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 6వ తేదీన తుది ప్రకటన చేయనున్నారు. 2025 జనవరి నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండే వారు ఆన్ లైన్ లో, ఆప్ లైన్ లో కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉంది. 

కాబట్టి ఉమ్మడి జిల్లా ఓటర్లు 30 లక్షలు దాటే వీలుందని అంటున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం నల్గొండ జిల్లాలో 15,02,203 మంది ఓటర్లు, సూర్యాపేట జిల్లాలో 10,04,284 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,58,426 మంది మొత్తంగా 29,64,913 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, వీరిలో ట్రాన్స్ జెండర్ ఓటర్లు 204 మంది ఉన్నారు. మూడు జిల్లాల్లో పురుష ఓటర్లు 14,58,709 మంది ఉండగా, మహిళా ఓటర్లు 15,06,000 మంది ఉన్నారు. పురుషుల కన్నా.. మహిళా ఓటర్లు 47,291 మంది ఎక్కువగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 6 తర్వాత ప్రకటించనున్న తుది జాబితా తర్వాత ఓటర్ల సంఖ్యలో మార్పులు ఉంటాయి.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner