Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు, పుకార్లు నమ్మొద్దు- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాదగిరి తెలిపారు. అన్నారం బ్యారేజీపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు.
Annaram Barrage : అన్నారం బ్యారేజీపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏ. యాదగిరి తెలిపారు. బ్యారేజీకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. అన్నారం బ్యారేజ్ కు ఢోకా లేదన్న ఆయన... పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పుకార్లు నమ్మవద్దన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 1275 మీటర్ల పొడవులో రెండు చోట్ల సీపేజ్ ఉందని, ఎక్కడా కూడా ఇసుక రావడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ, ఆఫ్కాన్స్ సంస్థల మధ్య కాంట్రాక్టు ఉందని, బ్యారేజీ నిర్వహణ బాధ్యత వాళ్లదే అన్నారు. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్ వేస్తున్నామన్నారు. సాండ్ తో రింగ్ బండ్ కూడా వేస్తున్నామన్నారు. ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపేజ్ వాటర్ తట్టుకునే విధంగా నిర్మాణంలో మార్పులు ఉంటాయన్నారు. అవసరం అయితే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తామన్నారు.
సీపేజ్ వాటర్ లీక్
అన్నారం బ్యారేజీలో వాటర్ లీకేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తు్న్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీ 4వ బ్లాక్ లోని 41వ పిల్లర్ అడుగు నుంచి వాటర్లీకవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ట్వీట్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనపై వాస్తవాలను నిర్థారించగలరా? అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి విమర్శలు
"కల్వకుంట్ల స్కామేశ్వరంలో మరో మైలు రాయి. నిన్న మేడిగడ్డ, నేడు అన్నారం. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు. ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌజ్ కు ప్రహరీ గోడనుకున్నావో..నీ మనవళ్లు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో. రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగు కోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు. వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం. నువ్వు గీసిన ఆ డిజైన్లు. రూ. లక్ష కోట్ల అవినీతి"- అని సీఎం కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.