Andole Tank Bund : ఆందోల్ ట్యాంక్ బండ్ లో బోటింగ్, రెస్టారెంట్- పర్యాటకులను ఆకర్షిచేందుకు ప్రణాళికలు
Andole Tank Bund : ఆందోల్ పట్టణ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ లో బోటింగ్, రెస్టారెంట్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై అధికారులతో మంత్రి చర్చించారు.
Andole Tank Bund : ఆందోల్ పట్టణానికి తలమానికంగా నిలిచిన ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ ను పర్యాటకుల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఆందోల్ ట్యాంక్ బండ్ లో పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం, రెస్టారెంట్, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై మంత్రి అధికారులతో చర్చించారు.

ఈ సమీక్షలో పట్టణంలో నిర్మిస్తున్న ఆధునిక లైబ్రరీ, మున్సిపల్ ఆఫీస్ పనుల పురోగతిపైనా చర్చించారు. ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీలో ఉన్న గాంధీ పార్క్ ఆధునీకరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. అలాగే పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్ గ్రౌండ్ లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మల్టీ పర్పస్ స్టేజ్ ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రజలకు వినోదం
ఆందోల్ జోగిపేట పట్టణం, జాతీయ రహదారి-161 పక్కనే ఉండటం, హైదరాబాద్ కు దగ్గర ఉండడం వలన టూరిస్ట్ లు వచ్చే అవకాశమున్నదని మంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆందోల్ కూడా అభివృద్ధి అవుతుండటంతో, పట్టణ ప్రజల వినోదం కోసం ఆందోల్ చెరువును అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీకి మూడువైపులా చెరువులు ఉండటంతో, ఈ పట్టణాన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ గా అభివృద్ధి చేయొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణంలో ఉన్న గాంధీ పార్క్ ను కూడా అన్నివిధాలా అభివృద్ధి చేయటానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రూ.30 కోట్ల పనులపై సమీక్ష
ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TUFIDC) రూ.30 కోట్ల 20 లక్షల నిధులతో చేపడుతున్న 34 పనుల పురోగతిపై అధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. మున్సిపాలిటీలో చేపడుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పట్టణ అభివృద్ధి కోసం విడుదలైన నిధులను సరిగ్గా ఉపయోగించుకోవాలని కోరారు.
ఆందోల్ లో ఎంఫార్మసీ కాలేజీ
ఈ పర్యటనలో ఆందోల్ లో నిర్మించనున్న ఎం ఫార్మసీ కళాశాల, ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు స్థల పరిశీలనను స్థానిక ఆర్డీఓ, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంకును సమకూర్చాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.