December 07 Telugu News Updates: ఎమ్మెల్యేల ఎర కేసు.. హైకోర్టులో సిట్‌ పిటిషన్-andhrapradesh and telangana telugu live news updates 7 december 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Andhrapradesh And Telangana Telugu Live News Updates 7 December 2022

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

December 07 Telugu News Updates: ఎమ్మెల్యేల ఎర కేసు.. హైకోర్టులో సిట్‌ పిటిషన్

  • Telugu Live News Updates 07 December 2022: సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంతో పాటు వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.50 కోట్లతో ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలనుద్దేశించి బహిరంగసభలో మాట్లాడనున్నారు. మరిన్ని ముఖ్యవార్తల కోసం ఈ లైవ్ పేజీని  రిఫ్రెష్ చేయండి….

Wed, 07 Dec 202212:40 PM IST

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ తేదీ ఫైనల్ అయ్యింది. ఈనెల 15న కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి తెలిపారు.

Wed, 07 Dec 202212:37 PM IST

ఎక్కడకు రమ్మన్నా నేను రెడీ

జనాభాలో బీసీలు 50శాతముంటే, జగన్ సభలో 50శాతం వాలంటీర్లు, పోలీసులు, బారికేడ్లదేనని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు బీసీలకు చేసిన మేలు, సంక్షేమం, జగన్ రెడ్డి బలహీనవర్గాలకు చేసిన ద్రోహమేంటో ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాన్నారు. సీదిరి అప్పలరాజు, జోగిరమేశ్ ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రెడీ అని చెప్పారు.

Wed, 07 Dec 202210:33 AM IST

జగిత్యాలలో భారీగా జనం

జగిత్యాల సీఎం సభ కోసం జనం పోటెత్తారు. ట్రాఫిక్ లో 400కు పైగా బస్సులు ఇరుక్కు పోయాయి. జనసంద్ర మైన కోరుట్ల జగిత్యాల రోడ్డు. సభాస్థలికి ప్రజలు ఇరుకున్నారు.

Wed, 07 Dec 202209:29 AM IST

జగిత్యాల కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం

జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు ఘన స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

Wed, 07 Dec 202208:10 AM IST

సిట్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు మెమో తిరస్కరించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. మరోవైపు ఇదే కేసులో బెయిల్ పొందిన సింహాయాజులు విడుదలయ్యారు.

Wed, 07 Dec 202208:08 AM IST

పట్టుకోమ్మలు బీసీలు

నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలుగా అభివర్ణించారు ముఖ్యమంత్రి జగన్. బీసీలకు తన గుండెల్లో చోటు ఉందన్నారు. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందన్నారు. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పానని... అందుకు అనుగుణంగానే రాజ్యాధికారంలోకి రాగానే బీసీలను భాగస్వామ్యం చేశామని వెల్లడించారు.నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదు.. వెన్నెముక కులాలు కాదని చెప్పుకొచ్చారు.

Wed, 07 Dec 202206:57 AM IST

జగన్ కామెంట్స్… 

జయహో బీసీ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. బీసీ కుటుంబం సభలో సముద్రంలా కనిపిస్తోందన్న ఆయన.. తన హృదయంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ లు అని వ్యాఖ్యానించారు. మన సమాజానికి బీసీలు వెన్నుమొక్కలు అని చెప్పారు.

Wed, 07 Dec 202206:56 AM IST

సీపీఐ నేతల అరెస్ట్… 

గత కొంత కాలంగా గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు కీలక బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికారపక్షం తీవ్రస్థాయిలో స్పందించింది. ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా గవర్నర్ తీరును తప్పుబట్టాయి. అసలు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఇదే డిమాండ్ తో బుధవారం సీపీఐ పార్టీ... రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది. ఈ క్రమంలో రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఖైరతాబాద్‌కు చేరుకున్న సీపీఐ నేతలు, కార్యకర్తలు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో రాజ్‌భవన్ వైపు వెళ్లనీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన కార్యకర్తలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడతో సహా పలువురు సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీపీఐ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకోవడంతో రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రాజ్‌భవన్ వైపు వస్తున్న సీపీఐ కార్యకర్తలు, నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

Wed, 07 Dec 202206:05 AM IST

సభకు చేరుకున్న సీఎం జగన్… 

జయహో బీసీ సభకు సీఎం వైెఎస్ జగన్ హాజరయ్యారు.  మహాత్మ జ్యోతి బాపూలే, దివంగంత నేత రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. మరోవైపు సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. 

Wed, 07 Dec 202205:23 AM IST

సభ ప్రారంభం…

విజయవాడ వేదికగా వైసీపీ తలపెట్టిన జయహో బీసీ సభ ప్రారంభమైంది. పలువురు మంత్రులు ప్రసంగించారు. స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ… టీడీపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు.

Wed, 07 Dec 202205:22 AM IST

ప్రైవేట్ బిల్లు.. 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా... 2019 ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం. ప్రధాన పార్టీలన్నీ ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించాయి. ఇక హోదా కోసం టీడీపీ ఢిల్లీ వేదికగా పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా మోదీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వరకు వెళ్లింది. ఇక వైసీపీ మాత్రం... హోదా తమతోనే సాధ్యమని చెప్పుకుంటూ వచ్చింది. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపిస్తే హోదా తీసుకువస్తామని స్పష్టం చేసింది. అనుకున్నట్లే వైసీపీ... 25 లోక్ సభ స్థానాలకు గానూ..22 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత.. పరిస్థితి మారినట్లు కనిపించింది. పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చినప్పటికీ... కేంద్రంతో పోరాటానికి దిగిన సందర్భాలు అయితే లేవు. ఇక తాజాగా పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరబోతున్న నేపథ్యంలో... హోదా అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టే పనిలో పడింది వైసీపీ నాయకత్వం. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు కసరత్తు కూడా చేస్తున్నారు.

Wed, 07 Dec 202203:10 AM IST

వ్యభిచార ముఠా అరెస్ట్… 

పిల్లలను కొన్నది.. పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చాకు.. వ్యభిచారం రొంపిలోకి దించింది ఓ మహిళ. ఇందుకోసం ఓ ముఠానే ఏర్పాటు చేసింది. వీరి బారి నుంచి ఓ బాలిక తప్పించుకోని బయటికి రావటంతో విషయమంతా బయటికి వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశంతో వీరి దందాను గుట్టురట్టు చేశారు. ఈ ఘటన యాదగిరిగుట్టలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం... యాదగిరిగుట్ట పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ కొన్నేళ్ల క్రితం బాలికలను కొని పెద్దయ్యాక తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళపల్లి వాసి కంసాని శ్రీనివాస్‌ దగ్గరికి పంపించింది. వారితో అతడు వ్యభిచారం చేయించేవాడు. వీరిని అనసూయ కొట్టి, భయపెట్టి వ్యభిచారం చేయించేది. నవంబరు 22న ఓ బాలిక జనగామ జిల్లా కేంద్రంలో బస్టాండ్‌వద్ద విలపిస్తూ కనిపించింది. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలిక తన కుమార్తె అని.. తనకు అప్పగించాలంటూ సంరక్షణ కేంద్రం అధికారులను కంసాని అనసూయ కోరింది. దీంతో వాస్తవాల నిర్ధారణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) సైదులుకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అనసూయ చెప్పిన కొన్ని విషయాలు అనుమానస్పందగా అనిపించటంతో అధికారులు..లోతుగా వివరాలు సేకరించారు. దీంతో అసలు విషయం బయటికి వెలుగు చూసింది.

Wed, 07 Dec 202202:26 AM IST

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడన ద్రోణి

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయువ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ మరింత బలపడి ఈ నెల 8న ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Wed, 07 Dec 202202:04 AM IST

నాలుక కోసి పరార్… 

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తలపై కొట్టడంతో పాటు బ్లేడ్‌తో నాలుక కోసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Wed, 07 Dec 202201:21 AM IST

సీఎం నెల్లూరు టూర్...

జయహో బీసీ మహాసభ ముగిసిన తర్వాత సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. ఈ మేరకు నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3:55 గంటల నుంచి సాయంత్రం 4:10 గంటల వరకు ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రం 6:20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు.

Wed, 07 Dec 202201:20 AM IST

వైసీపీ బీసీ మహాసభ…

YSRCP Jayaho BC Maha Sabha at Vijayawada: బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ​ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను తలపెట్టారు.

Wed, 07 Dec 202201:20 AM IST

గోషామహల్ పాలిటిక్స్… 

గోషామహల్... నాడు కాంగ్రెస్... నేడు బీజేపీ..! సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే రాజాసింగ్ అంటే గోషామహల్..! గోషామహల్ అంటే రాజాసింగ్ అన్నట్టు ఉంటుంది కథ..! కానీ సీన్ మారుతోందిబీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్ అయ్యాక.... తెరపైకి కొత్త రాజకీయ సమీకరణాలు వచ్చేస్తున్నాయి. అదే పార్టీకి చెందిన మరో యువ నేత... వేగంగా పావులు కదిపే పనిలో పడ్డారు. నిజానికి రాజాసింగ్ జైలుకు వెళ్లిన సమయంలోనే తెగ వార్తలు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. ఫలితంగా అసలు గోషామహల్ లో ఏం జరుగుతోంది...? జరగబోతుందనేది..? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Wed, 07 Dec 202201:20 AM IST

సీఎం కేసీఆర్ టూర్ 

సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంతో పాటు వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.50 కోట్లతో ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలనుద్దేశించి బహిరంగసభలో మాట్లాడనున్నారు.