Telangana Grameena Bank : ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనం.. మీ అకౌంట్ నంబర్ మారుతుందా.. 5 ముఖ్యమైన అంశాలు
Telangana Grameena Bank : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్.. 18 ఏళ్లుగా వరంగల్ ప్రధాన కేంద్రంగా తెలుగు రాష్ట్రాల ఖాతాదారులకు సేవలందించింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో విలీనం కాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌ను.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో విలీనం చేయనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారులకు వాట్సప్ మెసేజ్‌ల ద్వారా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన 5 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ ప్రధాన కేంద్రంగా ఏపీజీవీబీ 2006 మార్చి 31 ఏర్పడింది. తెలంగాణ ఆవిర్భవించినా రెండు రాష్ట్రాలకు ప్రధాన కార్యాలయంగా ఇది కొనసాగుతోంది.
2 తెలంగాణ.వ్యాప్తంగా 493 శాఖలు ఉన్నాయి. విలీనం తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌కు మారనుంది.
3.ఏపీజీవీబీ విలీనం కారణంగా ఖాతా నెంబర్లు మారవని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ఏపీజీవీబీ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0 ఆర్‌ఆర్‌డీసీబీగా మారనుంది.
4.ఖాతాదారులు టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని సేవలను ఉపయోగించుకోవచ్చు. అకౌంట్ నంబర్‌తో టీజీబీ యూపీఐ రిజిస్టర్ చేసుకోవాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించబోతున్నామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
5.ఏపీజీవీబీ బోర్డుల స్థానంలో టీజీబీ బోర్డులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంక్‌లు బంద్ కానున్నాయి. 2025 జనవరి 1 నుంచి మళ్లీ సేవలు పునః ప్రారంభం కానున్నాయి.