Telugu News  /  Telangana  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates 03 January 2023

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం(PTI)

January 03 Telugu News Updates : నేటి నుంచి రెండో విడత భారత్ జోడో యాత్ర

నేటి నుంచి రాహుల్‌ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్‌, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది. ఈనెల 20న జమ్మూకశ్మీర్ లోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. - ఈనెల 30న శ్రీనగర్ జెండా ఆవిష్కరణతో యాత్ర ముగియనున్నది. రెండవ విడత యాత్రలో పాల్గొనాలని పలు పార్టీలకు రాహుల్ గాంధీ ఆహ్వానం పలికారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామాన్ని ప్రకటించారు.

Tue, 03 Jan 202315:03 IST

స్తంభించిన వాహనాలు

హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ చౌరస్తా వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అడ్డంగా ట్యాంక్ బోల్తా పడి... ఓ వైపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో.. హైదరాబాద్ - విజయవాడ రహదారిపై వాహనాలు భారీగా స్తంభించాయి. రెండు దిక్కులా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఒక వైపు నుంచే పంపిస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. జాతీయ రహదారిపై అడ్డంగా ఉన్న ట్యాంకర్ ను తొలగించి.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tue, 03 Jan 202314:13 IST

ఆనంకు చెక్

కొన్నాళ్లుగా ప్రభుత్వంపై అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వెంకటగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరుపై.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయనకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆనంపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురమల్లి రామకుమార్ రెడ్డిని నియమించారు. తాజా పరిణామాలతో... రామకుమార్ రెడ్డి ఇంటి వద్ద సందడి నెలకొంది. అధిక సంఖ్యలో కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

Tue, 03 Jan 202313:47 IST

రైతుబంధు

రాష్ట్రంలో రైతుబంధు సంబురం కొనసాగుతోంది. ఈ పథకం కింద పదో విడత నిధులు రైతుల ఖాతాల్లోకి డిపాజిట్ అవుతున్నాయి. డిసెంబర్ 28న యాసంగి పెట్టుబడి సాయం మొదలవగా.. మొదటి 5 రోజుల్లో 70.09 లక్షల ఎకరాలకు గాను.... 49.17 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,504 కోట్లు జమ చేశారు. 6వ రోజు.. లక్ష 49,970 మంది రైతులకు రూ.262.60 కోట్లు అందాయి. ఆరో రోజు.. 5 లక్షల 25 వేల 200 ఎకరాలకు పెట్టుబడి సాయం నిధులు జమయ్యాయి. దీంతో... ఆరు రోజుల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 51 లక్షల 50,958 మంది రైతులకు రూ.3767.35 కోట్లు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Tue, 03 Jan 202313:09 IST

ఆనం అసంతృప్తి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని.. అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పరోక్షంగా ప్రభుత్వంపై మాటల అస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవలే నెల్లూరు జిల్లా రావూరులో జరిగిన వలంటీర్లు, సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ ... నాలుగేళ్లలో మనం ఏం చేశామని ప్రజల్ని మళ్లీ ఓట్లు అడగాలి ? అని ఆనం చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా.. మంగళవారం సైదాపురం మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని... సచివాలయాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వస్తే... తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. అనుకున్న పనులు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి తీరుపై.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురమల్లి రామకుమార్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Tue, 03 Jan 202311:58 IST

డయాలసిస్ సెంటర్ ప్రారంభం

ప్రభుత్వ వైద్య సేవల అంశంలో తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో గణనీయమైన పురోగతి సాధించిందని... వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ అన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో దేశంలోనే మొదటి స్థానంలో... వైద్య విద్య పీజీ సీట్ల విషయంలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని... కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకున్నా.. ఒకే సంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని... ఇది తెలంగాణ ఘనత అని అన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి హరీశ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ వైద్య విధానాలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాల పాలకులు మన వద్దకే వస్తున్నారని అన్నారు.

Tue, 03 Jan 202311:13 IST

జీవోపై దుమారం

రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై నిర్వహించే సభలపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో.. దుమారం రేపుతోంది. ఈ ఉత్తర్వులపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. ఆంక్షల అమలులో భాగంగా... జనవరి 4 నుంచి జరగనున్న చంద్రబాబు పర్యటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీకి ప్రజాదరణ చూసి ఓర్వలేకనే .. చంద్రబాబు సభలు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే బహిరంగ సభలు, ర్యాలీలు, నిషేధిస్తూ అర్ధరాత్రి వేళ హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన నిరంకుశ ధోరణి బయటపెట్టిందని.... జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో అని అన్నారు.

Tue, 03 Jan 202310:18 IST

మత్స్యకారుల సభ్యత్వ నమోదు

మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు 3 నెలలు పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని.. 30 వేల మందికి సభ్యత్వాలు కల్పిస్తామని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వాన్ని అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతినీటి వనరులో చేప పిల్లలు ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన మంత్రి తలసాని .... ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని... రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నీటి వనరులు కళకళలాడుతున్నాయని వివరించారు. పెరిగిన మత్స్య సంపద ఫలితాలను మత్స్యకారులకు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని... ముఖ్యమంత్రి ఆలోచనలతోనే మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు.

Tue, 03 Jan 202310:00 IST

సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి

మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3) సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్జానాన్ని, చారిత్రక కృషిని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోసారని సీఎం అన్నారు. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైనదనదని, నేటి తరానికి స్పూర్తిదాయకమని సిఎం అన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సమాన హక్కుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీత్కరింపులు అవమానాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రీబాయి ముందుకు సాగారని సిఎం అన్నారు. విధ్వేషాలకు వ్యతిరేకంగా తన ఆశయాల సాధన కోసం ధృఢ చిత్తంతో మహా సంకల్పంతో సావిత్రిబాయి పోరాడారని సీఎం కేసీఆర్ కీర్తించారు.

సంఘసంస్కర్తగా, రచియిత్రిగా సామాజిక సంస్కరణలకై నడుం బిగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి గా దేశాభ్యున్నతికి సావిత్రీబాయి అందించిన స్పూర్తిని నేటితరం కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. భారత దేశ ప్రగతికి సామాజికాభ్యున్నతికి వారి ఆలోచనలు నేటికీ ఆచరణయోగ్యమైనవేనని సిఎం తెలిపారు. జీవితపు చివరి క్షణం వరకు పీడిత ప్రజల సేవకోసమే అంకితమైన సావిత్రిభాయి ఫూలే సేవాతత్పరత, యావత్ భరతజాతి కి ప్రాత:స్మరణీయమని సీఎం తెలిపారు. సావిత్రీబాయి ఫూలే స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, మహిళల సమాన హక్కుల కోసం కృషి చేస్తున్నదని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ దిశగా అనేక పథకాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, మహిళా సాధికారతను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం కేసీఆర్ తెలిపారు.

Tue, 03 Jan 20239:56 IST

నవోదయ నోటిఫికేషన్

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇంటర్ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా, జనవరి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://navodaya.gov.in/

Tue, 03 Jan 20237:32 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్

 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు 'రౌస్ అవెన్యూ' న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రలకు బెయిల్ ఇచ్చింది.

Tue, 03 Jan 20235:46 IST

టీడీపీ నేతలకు  ముందస్తు బెయిల్

మాచర్ల టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది.  మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఏ7 మినహా మిగిలిన 22 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.   బ్రహ్మారెడ్డి సహా 22 మందికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Tue, 03 Jan 20235:39 IST

తిరుమలలో రికార్డు స్థాయి ఆదాయం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఒక్కరోజే హుండీ ద్వారా రూ. 7.68 కోట్ల కానుకలను భక్తులు సమర్పించినట్లు టిటిడి వెల్లడించింది. 2022 అక్టోబర్ 23న వచ్చిన రూ.6.31 కోట్ల ఆదాయమే ఇప్పటివరకు వచ్చిన అత్యధిక హుండీ ఆదాయం. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం శ్రీవారిని 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Tue, 03 Jan 20235:36 IST

రోడ్లపై సభలు, ర్యాలీల నిర్వహణపై ప్రభుత్వం నిషేధం

ఆంధ్రప్రదేశ్‌లో  రోడ్లపై సభలు, ర్యాలీల నిర్వహణపై ప్రభుత్వం నిషేధం విధించింది.  ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  జాతీయ రహదారులతో పాటు  రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ రోడ్లకు నిబంధనలు వర్తింప చేయనున్నారు. సభల నిర్వహణకు  ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.  షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

Tue, 03 Jan 20235:34 IST

నేడు గోదావరి నది బోర్డు సమావేశం

నేడు గోదావరి నది బోర్డు సమావేశం కానుంది.  గోదావరి బోర్డ్ ఛైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన భేటీ జరుగనుంది. భేటీకి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు.  గూడెం ఎత్తిపోతల, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్ ల సాంకేతిక అనుమతిలపై భేటీలో చర్చ జరుగనుంది. 

Tue, 03 Jan 20235:33 IST

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మె

వేతనాల పెంపు  కోరుతూ హైదరాబాద్‌ మెట్రో  ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఐదేళ్లుగా  వేతనాలు పెంచడం లేదంటూ ఉద్యోగులు సమ్మెకు దిగారు.  దీంతో ఎల్బీ నగర్‌ నుంచి మియా పూర్‌ వరకు మెట్రో టిక్కెట్ల కోసం ప్రయాణికులు బారులు తీరారు. 

Tue, 03 Jan 20235:32 IST

సునీల్ కనుగోలుకు కోర్టులో చుక్కెదురు 

పోలీసుల విచారణకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు సునీల్ కనుగోలును ఆదేశించింది. సునీల్‌ కనుగోలు పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. సిఆర్‌పిసి 41ఏ కింద నోటీసులు జారీ చేయడంపై  సునీల్‌ కనుగోలు కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ గళం పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీతో తనకు ఎలాంటి సంబంధం లేదని  సునీల్ కనుగోలు కోర్టుకు వివరించారు. మాయాబజార్ పేరుతో కేసీఆర్ కుటుంబంపై దుష్ప్రచాం చేస్తున్నారనే ఆరోపణలపై  పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. అదే సమయంలో సునీల్‌ను అరెస్ట్ చేయవద్దని  కోర్టు స్పష్టం చేసింది. 

Tue, 03 Jan 20235:36 IST

రిమాండ్ పిటిషన్ తిరస్కరణ

గుంటూరులో తొక్కిసలాటకు కారణమైన  ఉయ్యూరు శ్రీనివాస్ ను జడ్జి ఎదుట  పోలీసులు ప్రవేశపెట్టారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి  మినహాయింపు ఇచ్చారు.  రూ.25 వేల సొంత పూచీకత్తుపై శ్రీనివాస్‌ను విడుదల చేశారు.   పోలీసుల విచారణకు శ్రీనివాస్ సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

ఆర్టికల్ షేర్ చేయండి