December 05 Telugu News Updates : కామారెడ్డిలో రైతుల ఆందోళన
హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మె విరమించారు. వేతనాల పెంపు కోరుతూ గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులు యాజమాన్యం హెచ్చరికలతో దిగొచ్చారు. వేతనాలు పెంచేది లేదని మెట్రో రైల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో కార్మికులు విధుల్లో చేరారు. ఉద్యోగులకు త్వరలో మెట్రో రైలు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Thu, 05 Jan 202303:13 PM IST
సీఎం ఆదేశాలు
విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్ ల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం విద్యాశాఖపై సమీక్షించిన ఆయన... పలు కీలక సూచనలు తృచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలపగా... ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారం రోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబ్‌ను విద్యార్థికి అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలన్నారు.
Thu, 05 Jan 202311:10 AM IST
ఆందోళన
కామారెడ్డి నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. దీనిపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతుల నిరసన విషయంపై హైదరాబాద్‌లో జరుగుతున్న పట్టణప్రగతి సదస్సులో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమే ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలోనే దీనిపై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యంతరాలుంటే ముసాయిదాలో మార్పులు చేస్తామన్నారు.
Thu, 05 Jan 202311:09 AM IST
చంద్రబాబు ఫైర్
చట్టవిరుద్ధంగా తమ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని... తమ వాహనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌లో భయం పుట్టుకొచ్చిందని... ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఆనందపడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లినందుకు నిరసనగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎం.ఎం. కల్యాణ మండపం వరకు చంద్రబాబు పాదయాత్రగా వెళ్లారు.
Thu, 05 Jan 202309:30 AM IST
వాట్ నెక్స్ట్….?
Manikrao Thakre replaces Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్... గత కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సీనియర్లు, జూనియర్లు అనటమే కాదు.. ఏకంగా సేవ్ కాంగ్రెస్ అనే నినాదం వచ్చే వరకు వచ్చింది కథ..! ఇంతలోనే ఢిల్లీ నుంచి డిగ్గీరాజా వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పులు లేనట్లే కనిపించింది. ఇక శిక్షణ తరగతులకు దాదాపు సీనియర్లు అంతా డుమ్మా కొట్టారు. ఇదిలా నడుస్తుండగానే.. ఢిల్లీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ ను తప్పించింది. ఆయన ప్లేస్ లో మహారాష్ట్రకు చెందిన ఠాక్రేను రంగంలోకి దింపింది. ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Thu, 05 Jan 202309:17 AM IST
సిలబస్
TSPSC Group 3 Exam Syllabus: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. తాజాగా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస్టులతో గ్రూప్ - 3 నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే సిలబస్ లోని అంశాలు, పరీక్ష విధానానికి సంబంధించిన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని చూస్తే....
మొత్తం 3 పేపర్లు...
గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా మూడు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. బుధవారం ఈ సిలబస్ ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్పీఎస్సీ. గ్రూప్-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
Thu, 05 Jan 202306:28 AM IST
మేకపాటి విక్రమ్ రెడ్డికి నిరసన సెగలు
గడపగడపలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి నిరసన సెగలు తగిలాయి. సొంత మండలం మర్రిపాడులోనూ తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైంది. మూడున్నరేళ్లలో ఒక్కపనీ చేయలేదంటూ ఎమ్మెల్యేపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళలు, మీడియాపై మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం చేశారు.
Thu, 05 Jan 202306:27 AM IST
టీడీపీ నేతల గృహ నిర్బంధం
గుంటూరు జిల్లా మాజీ మంత్రి నక్కా ఆనంద్‍బాబు గృహనిర్బంధం విధించారు. వసంతరాయపురంలోని ఆనంద్‍బాబు నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయన్ని బయటకు రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. పొన్నురు మండలం చింతలపూడిలో ధూళిపాళ్ల ఇంటికి చేరుకున్న పోలీసులు, ధూళిపాళ్ల నరేంద్ర ఇంటి వైపు కార్యకర్తలు రాకుండా పోలీసుల చర్యలు చేపట్టారు.
Thu, 05 Jan 202306:26 AM IST
మాజీ హోంమంత్రి రాజకీయం
గుంటూరు జిల్లా కాకుమానులో మాజీ హోంమంత్రి సుచరిత ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనే ఉంటుందని ప్రకటించారు. తన భర్త దయాసాగార్ కూడా దానికి కట్టుబడే ఉంటారని, నా భర్త పార్టీ మారతానంటే ఆయనతో పాటు వెళ్లాల్సిందేనన్నారు. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందే అని చెప్పారు. భర్త ఒక పార్టీలో.. నేను మరో పార్టీలో.. మా పిల్లలు మరో పార్టీలో ఉండరన్నారు. రాజకీయల్లో మనగలిగినన్నాళ్లు జగన్‍తో ఉండాలనుకున్నామని చెప్పారు.
Thu, 05 Jan 202306:24 AM IST
అనకాపల్లికి సిఎం జగన్
నేడు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. విశాఖ డైరీ ఛైర్మన్ అడారి తులసిరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. అడారి తులసీరావు కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.
Thu, 05 Jan 202306:23 AM IST
కుప్పంలో చంద్రబాబు పర్యటన…..
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటించనున్నార. ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ శ్రేణులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించనున్నారు. రాత్రికి కుప్పంలోని రాష్ట్ర భవనాల శాఖ అతిథిగృహంలో చంద్రబాబు బస చేయనున్నారు.
Thu, 05 Jan 202306:22 AM IST
తిరుపతిలో గవర్నర్ పర్యటన…
తిరుపతి, తిరుమలలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ చేరుకోనున్నారు. తిరుపతిలో బాలాజీ వైద్య కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో డిజిటల్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకోనున్న గవర్నర్, మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.