Rock Paintings in Medak : రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్..! కనుమరుగవుతున్న గుండ్లపోచంపల్లి పురాతన రాతి చిత్రాలు
Gundla Pochampally Rock Paintings in Medak : మెదక్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి సమీపంలో రాతి చిత్రాలను గుర్తించారు. రియల్ ఎస్టేట్ విస్తరణతో ఈ తరహా రాతిచిత్రాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Gundla Pochampally Rock Paintings : హైదరాబాద్ కు 25 కి.మీ.ల దూరంలో కొంపెల్లి గ్రామానికి చేరువలోవున్న గుండ్లపోచంపల్లికి 2 కి.మీ.దూరంలో ప్రభుత్వ అటవీ భూముల అంచున 3శిలాశ్రయాలలో(Rock shelters) కొత్తగా రాతిచిత్రాలు(Rock Arts) కనుగొనబడ్డాయి. ఈ చిత్రిత శిలాశ్రయాలు భౌగోళికంగా 17.5820 డిగ్రీల అక్షాంశాలు,78.4617 డిగ్రీల రేఖాంశాలపై, సముద్రమట్టానికి 545మీ.ల ఎత్తున వున్నాయి.
సాయి కృష్ణ గుర్తించిన చిత్రాలు....
గుండ్లపోచంపల్లికి చెందిన సాయికృష్ణ, దక్కన్ యూనివర్సిటి చారిత్రక పరిశోధక విద్యార్థి, యువ ఇంజనీర్ (ప్రస్తుతం ఏఎస్పైలో ఉద్యోగి, డాక్టరేటు సాధించాడు.) చరిత్రపై ఆసక్తితో తన అన్వేషణను తన ఊరి నుంచే మొదలుపెట్టి సఫలీకృతంగా ఈ మూడు చిత్రితశిలాశ్రయాలను కనుగొన్నాడు. కొత్త తెలంగాణ చరిత్ర బృందాన్ని తమ గ్రామానికి ఆహ్వానించి మాకు వాటిని చూపించాడు. ఈ చారిత్రక యాత్రలో చరిత్ర బృందం యొక్క సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, బెల్లంకొండ సంపత్ కుమార్, ఫారెస్ట్ గార్డ్, సాయికృష్ణ తోడుగా రాతి చిత్రాలు పరిశీలించారు.
మధ్య, నవీన శిలాయుగం సంధి కాలానికి చెందిన రాతి చిత్రాలు:
మొదటి Rock shelterలో మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం సంధికాలానికి చెందిన రాతి చిత్రాలున్నాయి. చాలా అందంగా చిత్రించిన ఎరుపురంగు అడవిదున్నల చిత్రాలు ఆధునిక చిత్రకారుల పెయింటింగ్సునే సవాలు చేసేంత గొప్పగా కళాత్మకంగా వున్నాయి. రెండడుగుల ఎత్తు, మూడడుగుల పొడవున్న ఈ చిత్రాలు తెలంగాణ పూర్వయుగ చరిత్రకు కొత్తపేజీలు. ఇక్కడే కొన్ని రాతిపనిముట్లు లభించాయి. వాటిలో బూమరాంగు వంటి వంపుగల రాతిపనిముట్టు, పెచ్చురాళ్ళతో ఒకవైపు చెక్కిన గొడ్డళ్ళు, బొరిగెలవంటివి, రాతికత్తులు, మరొక నునుపైన రెండువైపులచెక్కిన రాతిగొడ్డలిముక్క (నవీనశిలా యుగానికి చెందినది)ఉన్నాయి.
ఎద్దుల రాతి చిత్రాలు........
రెండవ శిలారాయి చాలా ముఖ్యమైనది. ఎక్కువ చిత్రాలు వేర్వేరుకాలాల్లో ఒకదానిపై మరొకసారి గీసిన (over imposed) రాతి చిత్రాలు చాలా వున్నాయి. ఒకచోట అందమైన మొదటి శిలాశ్రయంలోని అడవిదున్నలతో పోలికలున్నచిత్రణతో మూపురమున్న ద్విశూలం వంటి వంపు కొమ్ములతో ఒక ఎద్దు ఉంది. ఇక దాని పక్కన గొప్ప చిత్రకారుని చేతిలో రూపుదిద్దుకున్న చిత్రం వంటి రెండెద్దులబొమ్మ, ఒక ఎద్దు వెనక మరొక ఎద్దు వాటి కొమ్ములు మధ్యలో అగుపిస్తుంటాయి. అదొక జమిలి ఎద్దుల బొమ్మ లెక్క కనిపిస్తుంది. వీటికి దగ్గరలో ఒక దుప్పిబొమ్మ చిత్రించిన తీరు మనోహరంగా ఉంది.ఈ పెద్ద చిత్రాల కాన్వాసులో మరొకచోట సన్నని గీతల ఏనుగు బొమ్మవుండడం విశేషం. మెదక్ జిల్లా అస్తలాపూర్ తర్వాత ఏనుగు కనిపించడం ఇక్కడే. చిత్రాల అంచులతో అంతటా ఈటెలు,తాళ్ళవలలు ధరించిన వేటగాళ్ళబృందాలు కని పిస్తున్నాయి. అవి కొంచెం ఎక్కువగా Fade అయి వున్నాయి. ఇంకొక చోట సామూహికనృత్యం చేస్తున్న ముగ్గురు ఆదిమానవుల దృశ్యం గొప్పచిత్రం. వాళ్ళ పక్కన పడివున్న జంతుదేహాలు కనిపిస్తున్నాయి.
ఈ శిలాశ్రయం వద్ద పరిశోధన జరిపితే ఆదిమానవుల పనిముట్లు దొరికే అవకాశముంది. మొదటి శిలాశ్రయం 10 అడుగుల ఎత్తు లోపలే వుంది. ఈ రెండో శిలాశ్రయం 20 అడుగుల ఎత్తులో వుంది. మూడో శిలాశ్రయంలో రాతిచిత్రాలన్నీ మాసిపోయివున్నాయి. పెద్దవి, పొడవైన కొమ్ములున్న మగజింక(ఇర్రి)వంటి జంతువు చిత్రించబడి వుంది. మరికొన్ని జింకలవంటి అస్పష్టచిత్రాలు అక్కడ అగుపిస్తున్నాయి. ఈ శిలాశ్రయం 30 అడుగుల ఎత్తులో వుంది.
ఈ చిత్రిత శిలాశ్రయాలు మూడుయుగాల ప్రతినిధులు. మూడో శిలాశ్రయం ప్రాచీనశిలాయుగానికి, మధ్యశిలాయుగానికి కూడా చెందినది. ఇక్కడి బొద్దుగీతల బొమ్మలు చాలా రఫ్ గా వున్నాయి. అంత ఎత్తున ఆదిమానవుల నివాసమున్నది మధ్యశిలాయుగాలకు ముందుననే. దట్టమైన అడవిలో కౄర జంతువులనుండి రక్షణకై ఇంత ఎత్తులలో వుండడం సహజంగా మధ్యశిలాయుగంనాటి లక్షణం. రెండవ శిలాశ్రయంలోని బొమ్మలు రెండుతరాలకు చెందినవిగా అగుపిస్తున్నాయి. సన్నని గీతలబొమ్మలు, వీటిలో ఆడవాళ్ళ బొమ్మలు లేవు. వేట దృశ్యాలు వీటి ప్రత్యేకత. చాల్కోలిథిక్ పీరియడ్లో వేసిన బొమ్మల వలె జననేంద్రియాల చిత్రణ లేదు వీటిలోవేసిన బొమ్మల మీదనే బొమ్మలు వేసివున్నాయంటే తర,తరాలుగా ఆదివాసుల ఆవాసంగా ఈ ప్రదేశముండివుంటుంది. రెండోతరం బొమ్మలన్నీ Fine Arts, కళాత్మకత వుట్టిపడుతున్నాయి. రెండెద్దుల బొమ్మలోని చిత్రకళానైపుణ్యం ఆదిమానవుల ఈస్థటిక్సుని తెలియచేస్తున్నది. మొదటి శిలాశ్రయం రాతిపనిముట్లవల్ల మధ్యశిలాయుగానిదని, రాతిచిత్రాల వల్ల నవీనశిలాయుగానిదని తెలుస్తున్నది. ఒకేచోట ఆదిమానవుల సాంస్కృతిక వైభవాన్ని చూడగలగడం ఒక అద్భుతం, అపూర్వం.
రియల్ ఎస్టేట్ తో ముప్పు..…
రోజురోజుకూ రియల్ ఎస్టేట్ విస్తరణ సాగుతుండటంతో ఈ తరహా రాత్రి చిత్రాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటి రక్షణ కోసం కేంద్రమంత్రి నుంచి స్థానిక రెవెన్యూ అధికారుల వరకు విజ్ఞప్తులు చేసినా ఫలితం మాత్రం శూన్యంగా ఉందని వాపోయారు.