Political Analysis: ఎందుకు మీ వైపు మొగ్గాలి..?-analysis on present telangana politics over upcoming assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Analysis On Present Telangana Politics Over Upcoming Assembly Elections 2023

Political Analysis: ఎందుకు మీ వైపు మొగ్గాలి..?

HT Telugu Desk HT Telugu
Jan 07, 2023 12:26 PM IST

తెలంగాణలో ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అనలిస్ట్ బొజ్జ రాజశేఖర్ విశ్లేషణ ఏంటో చూద్దాం….

Analysis On Telangana Politics: ఎందుకు మీ వైపు మొగ్గాలి..?
Analysis On Telangana Politics: ఎందుకు మీ వైపు మొగ్గాలి..?

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ ఏడాది చివరినాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ‘ఎన్నికల యుద్ధంలో ఎవరు దండెత్తి వస్తారో రండి, మీ గుండెల్లో నిద్రపోతా’ అన్నట్టుగా పాలక బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తన అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసి పెట్టుకున్నట్టే కనబడుతున్నారు. కానీ, వాటిని ఎదుర్కోవడానికి తెలంగాణలో ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయా? అనేది ఇప్పటికి ఒక పెద్ద ప్రశ్న! కాంగ్రెస్‌ సంస్థాగతంగా అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయింది. ఇక, బీజేపేమో, ఆయనకు ఎదురుగా నిలబడి ‘నీ గడీలు బద్ధలు కొట్టేది మేమే’ అని నాలుగున్నరేళ్లుగా, ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నుంచి తొడలు కొడుతూనే ఉన్నది! మరి నిజంగా బీఆర్‌ఎస్‌ ని గద్దె దించేందుకు బీజేపీ దగ్గర తగిన అస్రత శస్త్రాలున్నాయా? ప్రజలకు వారిపై నమ్మకం కలిగించే ఆర్థిక`సామాజిక త్య్రామ్నాయ ప్రణాళికలు ఉన్నాయా? అంటే... దిక్కులు

ట్రెండింగ్ వార్తలు

చూడాల్సిన పరిస్థితి!

నాలుగేళ్లుగా మాటల తూటాలతో గర్జిస్తున్న బీజేపీ, తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో, కేసీఆర్‌ పరిపాలనను మరిపించేలా ఏమేం పథకాలు అమలు చేస్తారో ఇంతవరకూ చెప్పనేలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర, ప్రజల్లోకి బీజేపీ వెళ్లడానికి బాగానే సాయపడిరది. కానీ, బీజేపీ వస్తే ఏం చేస్తుందో చెప్పి, ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో పూర్తిగా విఫలమయ్యింది. కేవలం అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతే ప్రతిపక్ష పార్టీలను గెలిపించలేదని బీజేపీ గుర్తించాలి. ఆ వ్యతిరేత ఆధారంగా అధికారపార్టీని తిట్టడం వల్ల, న్యూస్‌, వ్యూస్‌ వస్తాయేమోగానీ, ఓట్లు మాత్రం రాలవు. ‘ఉన్న వారిని కాదని, ఈ పార్టీకి ఓటేస్తే మాకేంటి?’ అని, పోలింగ్‌ ముందు ధీర్ఘంగా ఆలోచించుకొని మరి ప్రజలు పోలింగ్‌ కేంద్రంలో అడుగుపెడతారు. దానికి పార్టీలు ప్రకటించే అభ్యర్థులతో సహా నమ్మయోగ్యమైన మేనిఫేస్టో నే గీటురాయి అవుతుంది. క్షేత్ర స్థాయిలో ఏ నియోజకవర్గంలో చూసినా, చిత్తశుద్ధితో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపీ నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. చాలా చోట్ల రాబోయే ఎన్నికల్లో పోటి చేసే బీజేపీ అభ్యర్థి ఎవరో కూడా ప్రజల నోళ్లల్లో నానడం లేదు. ఇది బీజేపీకి నష్టమే చేస్తుంది. ఇక, తెలంగాణలో బీజేపీ తీసుకురావాలనుకుంటున్న మార్పు ఏంటో, ఆ మార్పు తాలూకు సిద్ధాంతాలు, ప్రణాళికల గురించి స్పష్టమైన అవగాహన ఆ పార్టీ నాయకులకే లేదు. ఈ స్థితిలో వారు ప్రజలకు విశ్వాసం కలిగించాల్సి ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వర్గానికి ఏదో ఒక రూపంలో పథకాల ద్వారా సాయం అందిస్తూ బీఆర్‌ఎస్‌ అన్ని చోట్లా తన ఆయుధాలను దాచి పెట్టుకున్నది. వాటిని ఎదుర్కోవడం బీజేపీకి, అనుకున్నంత సులువేం కాదు. ప్రతి ఆరునెలలకు కేసీఆర్‌ వేసే రైతుబంధు నగదు కోసం రాష్ట్ర రైతాంగం వేయి కళ్లతో ఎదురు చూస్తూ వస్తోంది. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ బఅందం క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నప్పుడు ఈ పథకానికి ‘రికాల్‌ వ్యాల్యూ’ అధికంగా ఉన్నట్టు తేలింది. ఇది కేసీఆర్‌ సాధించిన విజయంగానే చూడాలి. దేశంలో ఏ రాష్ట్రంలో రైతు బంధులాంటి పథకం అమలులో లేదు. రైతు బీమా, ఉచిత కరెంట్‌ పథకాల పట్ల కూడా రైతులకు సంతఅప్తి ఉంది. ఈ పథకాలను మరిపించేలా బీజేపీ ఏమేం చేయగలుగుతుందో ఇప్పటి వరకు చెప్పలేదు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉన్న రాష్ట్రాలతో పాటు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ప్రధానమంత్రి సమ్మాన్‌ నిధి ద్వారా ఆరు వేలకు, మరో 6,500 కలిపి 12,500 మాత్రమే ఇస్తున్నారు. రైతుబంధు స్థానంలో ఇలాంటి పథకాన్నే తీసుకొస్తామనే సంకేతాలు ఇస్తే తెలంగాణలో రైతులు బీజేపీకి దగ్గరవకపోగా, దూరంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసరా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం వఅద్ధులకు, ఒంటరి మహిళలకు రూ.2016, వికలాంగులకు రూ. 3,016 నగదు సాయం అందిస్తోంది. ఈ పథకానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధిక రికాల్‌ వ్యాల్యూ ఉంది. ఆసరాకు మించి ఏమివ్వగలదో కూడా బీజేపీ చెప్పలేదు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం కింద వెనకబడిన వర్గాల వారి ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు రూ. 1,00116 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకం కూడా వెనకబడిన వర్గాల్లో ప్రజాదరణ పొందింది. దీంతో పాటు అక్కడక్కడే అమలు చేస్తున్నా, ‘దళిత బంధు’ పథకం కూడా దళిత సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే వరుసలోనే ఉంది. క్షేత్ర స్థాయిలో తిరగుతున్నప్పుడు, నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానమిస్తూ రోడ్లు బాగున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ‘ తెలంగాణ వచ్చాకే హైదరాబాద్‌ రోడ్లు బాగయ్యాయి‘ అనే మాటలు అధికంగా వినపడుతున్నాయి. మొన్నటి వరకు, ‘ఉద్యోగాలు వేయట్లేద’నే ఆరోపణల్ని సమర్థంగా ఎదుర్కునేందుకా అన్నటు,్ట 2022లోనే మొత్తం 26 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటమూ బీఆర్‌ఎస్‌కు సానుకూలాంశమే!

పై అంశాల పరంగా చూసినప్పుడు బీఆర్‌ఎస్‌కి ఎక్కువ మార్కులే పడతాయి. కానీ, ఎన్ని చేసినా... ప్రజలకు తీరని ఆకాంక్షలూ, కోరికలూ ఉంటాయి. ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా అవి సంక్షేమం పేరుతో రాజ్యాంగ నిర్వహణ ప్రక్రియలో భాగమవుతాయి. కాబట్టి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పాదయాత్ర వంటి కార్యక్రమాలతో ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాల్ని తెలుసుకుంటాయి. వాటికి అనుకూలంగా ప్రణాళికలు రచించుకొని, వ్యూహాత్మకంగా నిరసనలు చేపడుతూ అధికార పక్షంపై వివిధ రకాల ఒత్తిడి పెడుతుంటాయి. అలాగే, ప్రజలకు సంబంధించి కొత్త అవసరాలను ముందుకు తీసుకొస్తాయి. దాంతో ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అన్న దానికి కొన్ని విలువలు, ప్రమాణాలు పుడతాయి. అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. అలాంటి విలువలు, ప్రమాణాల్ని సెట్‌ చేయడంలో తెలంగాణలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. కానీ, ఇప్పటికీ ప్రజల అవసరాల్లో కొన్ని ముఖ్యమైన వాటిని బీఆర్‌ఎస్‌ తీర్చలేకపోయింది. వాటిలో మొదటిది నీళ్లు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు దాటుతున్నా ఉమ్మడి మహబుబ్‌ నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటి సమస్య తీరలేదు. రెండోది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి బీఆర్‌ఎస్‌ మాట తప్పింది. మూడోది కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేస్తూ, ప్రయివేట్‌ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. సరైన రీతిలో ఉద్యోగ`ఉపాధి అవకాశాలు మెరుగుపరచకపోగా... నిరుద్యోగులకు ఇస్తమన్న నిరుధ్యోగ భఅతి కూడా ఇవ్వలేదు. విద్యా సంస్థలను కట్టించడం, మద్యపానం నిషేధించడం, పేదవాళ్లకు స్కాలర్‌ షిప్‌ లు ఇవ్వడం... ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలలోని సంక్షేమ బాధ్యతలు. వీటిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించలేకపోయింది. మద్యం అమ్మి రాష్ట్రాన్ని పోషించడం ఘనమైన విషయం అనిపించుకోదు. నివాసం కలిగి ఉండటం ఒక ప్రాథమిక హక్కు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని మోసం చేసి, ఆ హక్కును కాలరాసింది. వీటిని బీజేపీ తమ ఎజెండాలో చేర్చుకుని, స్పష్టమైన ప్రణాళికలతో మేనిఫెస్టోలో పొందుపరచాలి. బీఆర్‌ఎస్‌ కి ధీటుగా ఏం చేస్తారు అన్నది ప్రతి వర్గానికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. చివరగా చెప్పేదేమంటే... ప్రతిపక్షం ముందుకు తెచ్చిన ప్రజల అవసరాలను పాలకపక్షం నెరవేర్చలేకపోతే, తాము అధికారంలోకి వస్తే వాటిని నెరవేర్చడానికి తమ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ప్రజలకు వివరించినప్పుడే ప్రజల్లో విపక్షంపై విశ్వాసం పెరుగుతుంది. ఎవరు హక్కులు లేకుండా ఉన్నారు? ఎవరు అవకాశాలు, సదుపాయాలు లేకుండా ఉన్నారు? ఎవరి సంక్షేమాన్ని అటకెక్కించారు? వారికి కావాల్సినవి కల్పిస్తామనే భరోసా ఇవ్వగలిగారా? వారి సంరక్షణ కోసం ఏమైనా చేస్తామని ప్రకటించారా? అని బీజేపీ వీలయినంత తొందరగా ప్రశ్నించుకోవాలి. ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి పరిశోధనాత్మక ప్రత్యామ్నాయాలతో ముందుకు రావాలి. ఇలా చేయకుండా ప్రజా సంగ్రామ యాత్ర చేసినా, ప్రెస్‌ మీట్లు, సభలు పెట్టి కొత్త కొత్త పదాలతో అధికార పక్షాన్ని తిట్టినా ఏ రాజకీయ ప్రయోజనమూ ఉండదు. అసలే సమయం దగ్గర పడుతోంది!

- బొజ్జ రాజశేఖర్‌,

పీపుల్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి,

సెల్‌ నెెంబర్ : 9573516755

(గమనిక: వ్యాసంలోని విశ్లేషణ, అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. హెచ్‌టీ తెలుగువి కావు..)

బొజ్జ రాజశేఖర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అనలిస్ట్
బొజ్జ రాజశేఖర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అనలిస్ట్
IPL_Entry_Point