RTA Employee: మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో మందేస్తూ డ్యూటీ చేసిన ఉద్యోగి, సస్పెండ్ చేసిన కమిషనర్-an employee who was on duty while drinking alcohol at the mahbubabad rta office was suspended ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rta Employee: మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో మందేస్తూ డ్యూటీ చేసిన ఉద్యోగి, సస్పెండ్ చేసిన కమిషనర్

RTA Employee: మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో మందేస్తూ డ్యూటీ చేసిన ఉద్యోగి, సస్పెండ్ చేసిన కమిషనర్

HT Telugu Desk HT Telugu
Jun 19, 2024 06:31 AM IST

RTA Employee: మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో ఓ ఉద్యోగి వ్యవహారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆన్ డ్యూటీలో ఉన్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆఫీస్ టైమ్ లో బీర్ తో చిల్ అవడమే కాకుండా.. ఏకంగా ఆఫీసునే తన తాగుడుకు అడ్డాగా మార్చాడు.

మద్యం సేవిస్తూ విధులు నిర్వర్తించిన ఆర్టీఏ ఉద్యోగి
మద్యం సేవిస్తూ విధులు నిర్వర్తించిన ఆర్టీఏ ఉద్యోగి

RTA Employee: మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో ఓ ఉద్యోగి వ్యవహారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆన్ డ్యూటీలో ఉన్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆఫీస్ టైమ్ లో బీర్ తో చిల్ అవడమే కాకుండా.. ఏకంగా ఆఫీసునే తన తాగుడుకు అడ్డాగా మార్చాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఆ ఫోటో కాస్త తెగ వైరల్ అయ్యింది.

yearly horoscope entry point

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఉమ్మడి వరంగల్ లోని మహబూబాబాద్ జిల్లా ఆర్టీఏ ఆఫీస్ లో సురేష్ అనే యువకుడు టెక్నీకల్ సపోర్ట్ ఇంజినీర్(టీఎస్ఈ) గా పని చేస్తున్నాడు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న సురేష్ ఆర్టీఏ ఆఫీస్ నే తన డ్రింకింగ్ అడ్డాగా మార్చుకున్నాడు.

ఎండ ప్రభావమో.. మరేదైనా కారణమో గానీ దర్జాగా బీర్ బాటిల్ ఆఫీస్ టేబులు పై పెట్టుకుని మరీ పని చేయడం ప్రారంభించాడు. సాధారణంగా తాగి పని చేస్తేనే ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ సురేష్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా బీర్ బాటిల్ తన టేబుల్ పై పెట్టుకుని మరీ వర్క్ చేయడం స్టార్ట్ చేసాడు. అయినా ఆఫీసులో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

తప్పని చెప్పాల్సిన ఇతర అధికారులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరించారు. కానీ ఆర్టీఏ సేవల కోసం వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం సురేష్ బాగోతాన్ని కెమెరాలో బంధించాడు. తాగుతూ పని చేస్తున్న సురేష్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో మంగళవారం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

విధుల నుంచి తొలగించిన కమిషనర్

మహబూబాబాద్ జిల్లా ఆర్టీఏ ఆఫీస్ లో సురేష్ వ్యవహారం వైరల్ గా మారగా.. అది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, అసభ్యంగా వ్యవహరించడంతో రవాణాశాఖ కమిషనర్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఆయనను వెంటనే విధుల్లోంచి తొలగించినట్టు హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సురేష్ తో పాటు మహబూబాబాద్ డీటీవో గౌస్ పాషాపై విచారణ జరిపి తదుపరి చర్యల కోసం రవాణాశాఖ కమిషనర్ కు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.

అక్రమాలకు అడ్డాగా ఆఫీస్..

ఔట్ సోర్సింగ్ సిబ్బంది వ్యవహారం తో చర్చల్లో నిలిచిన మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్ అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్​ ఆదేశాల మేరకు దాదాపు 20 రోజుల కిందట ఏసీబీ అధికారులు మహబూబాబాద్​ ఆర్టీఏ ఆఫీస్​ లో తనిఖీలు నిర్వహించగా అక్కడి వ్యవహారం చూసి ఏసీబీ అధికారులు కూడా షాక్ అయ్యారు.

ఆఫీస్​ వెలుపలే ఉండాల్సిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, ఏజెంట్లు దర్జాగా ఆఫీస్​ లోపలికి ఎంటర్ అయ్యి కార్యకలాపాలు చక్కబెట్టడం చూసి అవాక్కయ్యారు. ఈ మేరకు ఆఫీస్​లో వివిధ డాక్యుమెంట్స్​, సర్టిఫికేట్స్​, లైసెన్స్​ అప్లికేషన్లు, డబ్బుతో ఉన్న ఆరుగురు ఏజెంట్లు, ఆఫీస్​ లో లెక్కల్లో లేని డబ్బు పట్టుకుని ఉన్న డీటీవో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఆఫీస్ లోపల ఉన్న ఆరుగురు ఏజెంట్ల వద్ద ఫిట్నెస్​ సర్టిఫికేట్లు, లెర్నింగ్, డ్రైవింగ్​ లైసెన్స్​ అప్లికేషన్లతో పాటు రూ.45,100, డీటీవో డ్రైవర్​ సుబ్బారావు వద్ద రూ.16,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు కౌంటర్లలో పని చేసే సిబ్బంది వద్ద కూడా నగదు లభ్యం కావడంతో ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. కాగా ప్రజలకు మేలైన సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో వ్యవస్థ మొత్తం గాడి తప్పిందని, ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి ఆర్టీఏ వ్యవస్థను చక్క దిద్దాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner