TG Mlc Elections: ఉద్యోగం వదిలి, ప్రజాక్షేత్రంలోకి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉత్తర తెలంగాణలో పోటీ..-an assistant professor who left his job and entered the public sector contested in north telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections: ఉద్యోగం వదిలి, ప్రజాక్షేత్రంలోకి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉత్తర తెలంగాణలో పోటీ..

TG Mlc Elections: ఉద్యోగం వదిలి, ప్రజాక్షేత్రంలోకి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉత్తర తెలంగాణలో పోటీ..

HT Telugu Desk HT Telugu

TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతూ ఓటర్ల నమోదులో బిజీగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా గజ్వెల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న ఉద్యోగాన్ని వదిలి రాజకీయ అరంగేట్రం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగం వదిలి ఎమ్మెల్సీ బరిలో దిగిన ప్రసన్న హరికృష్ణ

TG Mlc Elections: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా మేధావుల సభలో అడుగు పెట్టేందుకు సిద్ధమైనట్లు గజ్వేల్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పులి ప్రసన్న స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలనేది నిర్ణయించుకోలేదని, పాలిటిక్స్ లో మార్పుకోసం ఎన్నికల బరిలో నిలుస్తానని పులి ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన పులి ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొపేసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.‌ లేఖను గజ్వెల్ లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు రాజీనామా లేఖను అందజేసి ర్యాలీగా కరీంనగర్ కు చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.‌ ఉద్యోగానికి రాజీనామా చేసి త్వరలో జరగనున్న కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రములో Ph.D చేస్తున్నారు.‌

లెక్చరర్ నుంచి పొలిటికల్ లీడర్ వరకు..

2008లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో ప్రసన్న హరికృష్ణ ప్రతిభ చూపి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా ఉద్యోగం పొందారు. అదే సమయంలో స్థానిక మారుమూల ప్రాంత నిరుపేద విద్యార్థులకు ఉచిత ఎంసెట్ తరగతులు నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాలంలో డిగ్రీ లెక్చరర్ గా పదోన్నతి పొందారు.

ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాలంలో సివిల్ సర్వీస్ అభ్యర్థుల కోసం "మిషన్ టు ముస్సోరి” కార్యక్రమం, పోటీ పరీక్షలైన గ్రూప్స్, ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత గైడెన్స్ కోచింగ్ తో పాటు సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీల పిజీ ప్రవేశ పరీక్షలకు అవసరమైన కోచింగ్ ఉచితంగా అందించారు.

కొంతకాలం లక్షెట్టిపేట్ లో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో పని చేసి ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తు రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు.

నిరుద్యోగులకు వారధి ప్రసన్న హరికృష్ణ

పులి ప్రసన్న హరికృష్ణ సుమారు 18 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులకు బాసటగా నిలిచారు. తన బోధన ద్వారా మోటివేషనల్ స్పీచ్ ల ద్వారా, గైడెన్స్ కౌన్సిలింగ్, పోటీ పరీక్షల పుస్తక ప్రచురణ సంస్థల్లో అగ్రగామిగా పేరొందిన విన్నర్స్ పబ్లికేషన్స్ సలహాదారునిగా ఉద్యోగ మార్గదర్శనం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు.

పోటీ పరీక్షల శిక్షకునిగా నిరుద్యోగుల సమస్యలను, ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గర ఉండి చూసిన ఆయన, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార సాధనలో తోడ్పాటును అందించారు. ప్రసన్న హరికృష్ణ పుస్తకాలు చదివి గైడెన్స్, కౌన్సిలింగ్ క్లాస్ లు విన్న లక్షలాదిమంది నిరుద్యోగులు ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి కలెక్టర్ వరకు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

సామాజిక సేవకుడిగా..

ఒక పక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోపక్క సమయం దొరికినప్పుడల్లా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అక్కడక్కడా జాబ్ మేళాలను నిర్వహించి ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించారు. రాష్ట్రంలో చాలా చోట్ల గ్రంథాలయాలకు లక్షలాది రూపాయల విలువ చేసే పుస్తకాలను ఉచితంగా అందజేశారు.

ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాలను ఉచితంగా అందజేశారు. నిష్ణాతులైన అధ్యాపకులు కలిగి ఉన్న విన్నర్స్ ఆన్లైన్ అనే సంస్థ ద్వారా ఉచితంగా కోర్సులను అందించి నిరుద్యోగుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. చదువుకోవాలని ఆసక్తి ఉండి పేదరికం కారణంగా చదువుకు దూరమైనవారికి, అనాధ పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు.

ఎంతోమంది నిరుపేద అభ్యర్థులకు తన దగ్గరే ఆశ్రయం కల్పించి వారికి అండగా నిలిచా పేద విద్యార్థుల ఉన్నత విద్య ఖర్చులను తానే భరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం కోసం ఉద్యోగ బాధ్యతలు నోచుకోని వారికి ఆర్థిక చేయూతను అందించి వారి కుటుంబాలలో వెలుగులు నింపారు. కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో వరదలు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ విధంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు వాటి పరిష్కారాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న ప్రసన్న హరికృష్ణ ను గెలిపించుకుంటే చట్ట సభల్లో వారి గొంతుకగా నిలబడడంతో పాటు, అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని మెదావులు బావిస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ గెలుపే లక్ష్యంగా పట్టభద్రులు కృషి చేస్తారని భావిస్తున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)