'తెలంగాణలో అధికారంలోకి వస్తాం' - నిజామాబాద్ సభలో అమిత్ షా-amit shah said that bjp will definitely come to power in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'తెలంగాణలో అధికారంలోకి వస్తాం' - నిజామాబాద్ సభలో అమిత్ షా

'తెలంగాణలో అధికారంలోకి వస్తాం' - నిజామాబాద్ సభలో అమిత్ షా

తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నిర్వహించిన కిసాన్ మహా సమ్మేళన్ సభలో మాట్లాడిన ఆయన…కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని విమర్శలు గుప్పించారు.

కిసాన్ మహా సమ్మేళన్‌ లో కేంద్రమంత్రి అమిత్ షా

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ మహా సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలపై విమర్శల వర్షం గుప్పించారు.

అధికారంలోకి వస్తాం - అమిత్ షా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ… అవినీతి పోలేదన్నారు.

ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌కు పసుపు బోర్డు సాధించారని అమిత్ షా ప్రశంసించారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలుపుతున్నానని… పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్‌ పసుపు వెళ్తుందని చెప్పారు.

ఈ సభ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని… పాకిస్థాన్‌ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని విమర్శించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని వ్యాఖ్యానించారు.

వెంటనే లొంగిపోవాలి - అమిత్ షా వార్నింగ్

నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి హెచ్చరించారు. నక్సలిజం లేకుండా చేయాలన్నదే మోదీ సర్కార్ లక్ష్యమని పునరుద్ఘాటించారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.