Amit Shah Munugode : ‘రైతులను కేసీఆర్​ ప్రభుత్వం మోసం చేసింది’-amit shah munugode bjp leader slams trs government and kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Amit Shah Munugode : ‘రైతులను కేసీఆర్​ ప్రభుత్వం మోసం చేసింది’

Amit Shah Munugode : ‘రైతులను కేసీఆర్​ ప్రభుత్వం మోసం చేసింది’

Sharath Chitturi HT Telugu
Aug 21, 2022 07:20 PM IST

Amit Shah Munugode : మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్​ షా. కేసీఆర్​పై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

<p>మునుగోడు బహిరంగ సభలో అమిత్​ షా ప్రసంగం</p>
మునుగోడు బహిరంగ సభలో అమిత్​ షా ప్రసంగం (ANI)

Amit Shah Munugode visit : కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్​ కుటుంబానికి ఏటీఎంగా మారిందని మండిపడ్డారు కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్​ నేత అమిత్​ షా. కేసీఆర్​ కుటుంబ పాలన వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని ఆరోపించారు.

మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్​ షా. మునుగోడు అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూనే.. ఈ ప్రాంతానికి కేసీఆర్​ ద్రోహం చేశారని విరుచుకుపడ్డారు.

"ఇన్నేళ్ల పాలనలో కేసీఆర్​ ప్రభుత్వం ఏం చేయలేదు. దళితుడిని సీఎం చేస్తానని అప్పట్లో కేసీఆర్​ అన్నారు. చేశారా? టీఆర్​ఎస్​కు ఓటు పడితే.. కేసీఆర్​ ఎన్నిసార్లైనా సీఎం అవుతారు. దళితబంధును ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? రెండు పడకల గదులు ఉన్న ఇళ్లులు ఇస్తానని కేసీఆర్​ హామీ ఇచ్చారు. కనీసం టాయిలెట్లు కూడా నిర్మించలేదు. కేంద్రం నిర్మిస్తున్న టాయిలెట్లను కూడా ఆయన అడ్డుకోవడం దురదృష్టకరం. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. ఇచ్చిందా? రైతులను.. కేసీఆర్​, ఆయన కుటుంబం తీవ్రంగా మోసం చేసింది. పీఎం ఫసల్​ బీమాను తెలంగాణలో అమలు చేయనివ్వడం లేదు. రైతులు నష్టపోతున్నారు," అని మండిపడ్డారు అమిత్​ షా.

ఇదే సభలో.. కాంగ్రెస్​ మాజీ నేత రాజగోపాల్​ రెడ్డి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్​ షా సమక్షంలో.. రాజగోపాల్​ రెడ్డి సహా పలువురు నేతలు.. బీజేపీలోకి చేరారు. రాజగోపాల్​ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించిన అమిత్​ షా.. ఆయనకు ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'రాజగోపాల్​ రెడ్డిని గెలిపిస్తే.. 'టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి పారేసినట్టే,' అంటూ వ్యాఖ్యానించారు.

రానున్న ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి జోస్యం పలికారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డితో పాటు బండి సంజయ్​, ఈటల రాజేంద్ర, విజయశాంతి సహా ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఎన్​టీఆర్​తో షా భేటీ..!

Amit Shah NTR meet : అంతకుముందు.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బేగంపేట్​ విమానాశ్రయంలో దిగారు అమిత్​ షా. కిషన్​ రెడ్డి, బండి సంజయ్​లు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్​లోని ఉజ్జయిని ఆలయానికి వెళ్లిన అమిత్​ షా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అక్కడి నుంచి సాంబమూర్తి నగర్​లోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లారు షా. అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు సమయం గడిపారు.

కాగా.. ఈ రోజు రాత్రికి.. టాలీవుడ్​ హీరో ఎన్​టీఆర్​ని అమిత్​ షా కలుస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చలు జరుగుతున్నాయి. అనూహ్యంగా వీరి మధ్య భేటీ జరుగుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం