Ponguleti Meets CM Jagan : సీఎం జగన్ తో పొంగులేటి భేటీ, షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై చర్చించారా?
Ponguleti Meets CM Jagan : మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. పొంగులేటి సీఎం జగన్ తో భేటీ అవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Ponguleti Meets CM Jagan : ఏపీ సీఎం జగన్ తో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. పొంగులేటి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సీఎం జగన్‌తో పొంగులేటి సమావేశం కావడం చర్చకు దారితీసింది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పొంగులేటి, సీఎం జగన్ తో భేటీ వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధించి చర్చ జరగలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు దక్షిణ, మధ్య డిస్కమ్‌లలో టెండర్లు ఖరారయ్యాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలకు రూ.4,592 కోట్ల విలువైన టెండర్లను అప్పగించినట్లుగా సమాచారం. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి రూ.2056.95 కోట్ల విలువైన పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు దక్కించుకుంది. ఉత్తారంధ్రలో పొంగులేటికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ పలు ప్రాజెక్టులు చేస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన పలు కంపెనీలు ఏపీలో పలు ప్రాజెక్టులు చేస్తున్నాయి. కడపలో వరదల ధాటికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు పొంగులేటి కంపెనీ చేస్తుంది. రూ.660 కోట్లకు ఈ టెండర్ ఖరారైంది.
షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై!
తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఆమె భేటీ అయ్యారు. అనంతంర దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిశారని ప్రచారం జరిగింది. త్వరలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అంటున్నారు. షర్మిల ఏపీలో రాజకీయాలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పార్టీ విషయంపైనా పొంగులేటి సీఎం జగన్‌తో చర్చించి ఉంటారని తెలుస్తోంది.
సీఎం జగన్ తో విభేదిస్తా
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొంగులేటి మాట్లాడుతూ... అధిష్టానం ఏపీ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన ఆయన.. పార్టీలో తనకు ఏ బాధ్యతలు అయినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అవసరమైతే సీఎం జగన్‌తో విభేదిస్తానని స్పష్టం చేశారు. వ్యాపారాలకు, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధినేత సరిగ్గా లేరని కేసీఆర్ విమర్శలు చేశారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనకు ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో అభివృద్ధి కోసం ఏ చిన్నపాటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని పొంగులేటి అన్నారు.