Union Bank Robbery : భార్య జల్సాలు, అప్పులు కట్టేందుకు బ్యాంకులో చోరీకి భర్త ప్లాన్
Union Bank Robbery : వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంక్ లో చోరీయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురి నిందితులను అరెస్టు చేశారు. తనను మోసం చేసినట్లు మరో ముగ్గుర్ని మోసం చేసిన ఓ యువతి...అప్పులు తీర్చేందుకు వేసిన పథకం బ్యాంక్ చోరీ అని పోలీసులు తెలిపారు.
Union Bank Robbery : వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంక్ లో చోరీకి విఫలయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. డిసెంబర్ 30న బ్యాంకు తెరవగా స్ట్రాంగ్ రూమ్ హ్యాండిల్ విరిగిపోయి పక్కన పడి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ వైర్లు కత్తిరించి ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకులో బాత్రూం పక్కన ఉన్న కిటికీ అద్దాలు పగలగొట్టి, కిటికీ ఐరన్ గ్రిల్స్ ఊడిపోయి ఉండడాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు స్ట్రాంగ్ రూమును తెరిచి చూడగా స్ట్రాంగ్ ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు. స్ట్రాంగ్ రూమ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో బ్యాంకు కిటికీ అద్దాలు, గ్రిల్స్ పగలగొట్టి బ్యాంకులోనికి ప్రవేశించి స్ట్రాంగ్ రూము హ్యాండిల్ విరగొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నించారని బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు.
బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీమ్ నిందితులను ఆదివారం మధ్యాహ్నం అమరచింత పట్టణంలో వాహన తనిఖీల్లో కారులో వెళ్తున్న ఐదుగురిని అనుమానంతో ఆపడానికి ప్రయత్నించగా.. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించారు. ఈ కేసుల వివరాలను సోమవారం పోలీసులు మీడియాకు వివరించారు.
నిందితుల్లో ఒకరైనా పసుల అంకిత బీటెక్ వరకు చదువుకుంది. 2019లో అంకితకు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ లో టికెట్ కౌంటర్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి సాయి నివాస్ అనే వ్యక్తిమోసం చేసి 5 లక్షలు తీసుకున్నారు. ఎంతకీ జాబ్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి, ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. తన జీతం డబ్బులు జల్సాలకు సరిపోవడం లేదని ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాను ఎలాగ మోసపోయిందో అలాగే, సౌత్ సెంట్రల్ రైల్వేలో టికెట్ కౌంటర్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి గద్వాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.18 లక్షలు తీసుకొని గోవా, బెంగళూరులో తిరుగుతూ జల్సాలు చేసింది.
2022లో అంకిత రాచాల జగదీశ్వర్ రెడ్డిని వివాహం చేసుకుంది. జాబ్ ఇప్పిస్తానని మోసం చేసినట్లు గద్వాల టౌన్, అయిజా పోలీస్ స్టేషన్ లలో పసుల అంకితపై ముగ్గురు వ్యక్తులు కేసు పెట్టారు. కేసుల విషయం తెలుసుకున్న తెలిసి అంకిత తన భర్తతో జరిగిన విషయం చెప్పింది. ఎలాగైనా డబ్బులు చెల్లించమని తన భర్తని కోరింది. ఆ ముగ్గురికి డబ్బులు తిరిగి ఇస్తానని భర్త ఒప్పుకున్నాడు. వారికి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు అంకిత, ఆమె భర్త. అంకిత, తన భర్త జగదీశ్వర్ రెడ్డితో కలిసి రాచాల భాస్కర్ రెడ్డి, మంద నాగరాజు, గణేష్ లకు డబ్బు ఆశ చూపించి వారిని ఒప్పించి పథకం ప్రకారం కారులో గద్వాల, నారాయణపేట, మరికల్ ప్రాంతాలలో ఉన్న బ్యాంకులలో దొంగతనం చేసేందుకు వెళ్లారు.
గత నెల 27వ తేదీ రాత్రి సమయంలో అమరచింత మండలంలో ఉన్న యూనియన్ బ్యాంకు లో దొంగతనం చేయాలని బ్యాంకు వెనకవైపు ఉన్న కిటికీ గ్రిల్స్ ఊడగొట్టి బ్యాంకులోనికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్ ఉన్న స్ట్రాంగ్ రూము డోర్ ను తెరిచేందుకు గడ్డపార, మంకీ స్పానర్, ఐరన్ పైప్ లతో పగలగొట్టడానికి ప్రయత్నం చేయగా అది తెరుచుకోలేదు. చోరీయత్నం సీసీ కెమెరాల రికార్డు అవుతుందని సీసీ కెమెరాలకు ఉన్న డీవీఆర్ ఎత్తుకెళ్లారు. బ్యాంకులో ఉన్నటువంటి బంగారం, నగదు, డాక్యుమెంట్స్, వస్తువులు పోలేదని పోలీసులు నిర్థారించారు.
సంబంధిత కథనం