TG Electricity : విద్యుత్ సరఫరాలో సమస్యలున్నాయా.. అయితే ఈ నంబర్‌కు కాల్ చేయండి
TG Electricity : రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. ఏ చిన్న పని కావాలన్నా కరెంట్ తప్పనిసరి అయ్యింది. కాసేపు కరెంట్ పోతే.. అన్ని పనులు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ వినూత్న ఆలోచన చేసింది. కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగితే.. వెంటనే పునరుద్ధరించే చర్యలు చేపట్టింది.
కరెంట్ సరఫరాకు ఆటంకం కలిగినప్పుడు పునరుద్ధరణ సేవలను వేగవంతం చేసేందుకు.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వాహనాలను కేటాయించి.. పునరుద్ధరణ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలకు కూడా కేటాయిస్తున్నారు. తాజాగా.. సంగారెడ్డి జిల్లాకు రెండు వాహనాలను కేటాయించారు. వీటిల్లో సిబ్బంది తోపాటు సామగ్రిని తరలించి కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తారు.

తక్షణ సేవలే లక్ష్యంగా..
విద్యుత్ వినియోగదారులకు తక్షణ సేవలే లక్ష్యంగా 108 అంబులెన్సుల తరహాలో.. విద్యుత్తు శాఖ 1912 టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబరుకు ఫోన్ చేయగానే.. ఈ వాహనాల్లో సిబ్బంది వచ్చి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో తరచూ విద్యుత్తు సమస్యలు తలెత్తుతుంటాయి. వినియోగదారులు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా.. సిబ్బంది చేరుకునేసరికి ఆలస్యమవుతోంది.
అప్పటికప్పుడు..
ఇలాంటి సమస్యల నేపథ్యంలో.. విద్యుత్ శాఖ ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు దూరం కానున్నాయి. ఈ వాహనాల్లో విద్యుత్తు తీగలు, ఫ్యూజులు, తాళ్లు, కండక్టర్లు, నిచ్చెన వంటి సామగ్రి ఉంటాయి. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురైతే.. వెంటనే మరొకటి మార్చేందుకు కూడా వాహనం అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ సమస్యలకు చెక్..
ఈ ప్రత్యేక వాహనాల ద్వారా ముఖ్యంగా.. బ్రేక్‌డౌన్ సమస్యలపై తక్షణం స్పందిస్తారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల వేగవంతం అవుతాయి. తెగిపోయిన తీగలను అప్పటికప్పుడు సరిచేస్తారు. గాలి వానల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు వెంటనే స్పందిస్తారు. స్తంభాలు కిందపడిపోతే వెంటనే సరిచేస్తారు. తీగలపై చెట్లు పడితే.. తక్షణమే తొలగింపు చర్యలు చేపడతారు. ఇతర సమస్యలు ఉంటే అధికారుల సూచనల మేరకు పనిచేస్తారు.
డయల్ 1912..
ఈ ప్రత్యేక వాహనాలతో విద్యుత్తు సేవలు మరింత మెరుగుపడతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్గం ఇప్పటికే పలు జిల్లాలలకు రెండు చొప్పున వాహనాలను పంపించారని అంటున్నారు. వీటి సేవలు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయని.. ఎక్కడైనా సరఫరాలో సమస్యలు తలెత్తితే పునరుద్ధరణలో జాప్యం లేకుండా చూస్తున్నామని కరెంట్ ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. 1912 టోల్ ఫ్రీ నంబరు సేవల్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.